.. ఇక సీఐల వంతు! | - | Sakshi
Sakshi News home page

.. ఇక సీఐల వంతు!

Oct 13 2026 1:17 AM | Updated on Oct 13 2026 1:17 AM

సాక్షిప్రతినిధి, వరంగల్‌ :

పోలీస్‌ వర్గాల్లో బదిలీల కాక మొదలైంది. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఎస్‌ఐల బదిలీల పర్వం ముగియడంతో ఇప్పుడు అందరి చూపు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టింగ్‌లపై పడింది. ఈ నెల 10న ఏకంగా 35 మంది ఎస్‌ఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడిన విషయం తెలిసిందే. తదుపరి వంతు పోలీస్‌ స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓలుగా ఉన్న ఇన్‌స్పెక్టర్లదేనన్న ప్రచారం జరుగుతోంది. గత ఆగస్టులో 22మంది ఇన్‌స్పెక్టర్లకు స్థానచలనం కలిగింది. ధర్మసాగర్‌, ఎల్కతుర్తి, పరకాల, ఆత్మకూరు, హనుమకొండ ఉమెన్‌ ఠాణాలతో పాటు పలుచోట్ల పోస్టింగ్‌ ఇచ్చారు. దసరా తర్వాత కమిషనరేట్‌ పరిధిలో పలువురు సీఐలకు స్థానచలనం ఉంటుందన్న చర్చ పోలీసు వర్గాల్లో వేడెక్కిస్తోంది.

‘కీలక’ ఠాణాల కోసం కుస్తీ..

కమిషనరేట్‌ సర్కిళ్ల పరిధిలో పట్టు.. కీలక స్టేషన్‌లో పోస్టింగ్‌.. ఇదే లక్ష్యంగా పలువురు సీఐలు పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కేయూసీ, సుబేదారి, హనుమకొండ, ఇంతేజార్‌ గంజ్‌, మట్వాడా, కేయూసీ, మడికొండతో తొమ్మిది పోలీస్‌స్టేషన్లలో పోస్టింగ్‌లపై కొందరు కన్నేసినట్లు ప్రచారం జరుగుతోంది. కేయూసీ, సుబేదారి ఠాణాల కోసం ఓ ఎస్బీ ఇన్‌స్పెక్టర్‌, వర్ధన్నపేట నియోజకవర్గంలో పనిచేసిన ఓ సీఐ ఇప్పటికే సిఫారసు లేఖలు పొందారన్న చర్చ ఉంది. గ్రేటర్‌ వరంగల్‌లోని ఓ ట్రాఫిక్‌ సీఐకి కూడా స్థానచలనం తప్పనిసరి అని చెబుతున్నారు. పదవీకాలం ఏడాది పూర్తయిన వాటిపై, స్టేషన్‌కు కొచ్చి కొద్దిరోజులే అయినా వివాదాస్పదంగా మారిన ఠాణాలపై కొందరు కన్నేసినట్లు సమాచారం. ఆశించిన పోస్టింగ్‌ దక్కించుకునేందుకు తమకున్న పరిచయాలను ఉపయోగించుకుంటున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి.

ఎవరికి ‘స్టేషన్‌’.. ఎవరికి ‘వీఆర్‌’?

కమిషనరేట్‌లో పోస్టింగ్‌ కోసం స్థానిక అధికారులే కాకుండా పొరుగు జిల్లాల్లో పనిచేస్తున్న కొందరు ఇన్‌స్పెక్టర్లు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. గతంలో కమిషనరేట్‌ పరిధిలో పనిచేసి పలు వివాదాలను ఎదుర్కొన్న వారు పరిస్థితులు మారడంతో మళ్లీ వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఐజీ అటాచ్డ్‌లో ఉన్న ఇద్దరు సీఐలు, 2012 బ్యాచ్‌కు చెందిన మరో ఇన్‌స్పెక్టర్లు తమకు అనుకూలమైన పోస్టింగ్‌ కోసం ఇప్పటికే సంప్రదింపులు జరిపారన్న ప్రచారం జరుగుతోంది. ఉత్తర్వులు వెలువడటమే తరువాయి అన్న ప్రచారం వారి సహచరుల్లో వినిపిస్తోంది. దీంతో స్థానికంగా పనిచేస్తున్నవారికి ఎలాంటి పోస్టింగ్‌లు దక్కుతాయి? బయట నుంచి వచ్చేవారికి ఏయే బాధ్యతలు అప్పగిస్తారు? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా ఎస్‌ఐల బదిలీలతో మొదలైన కదలిక.. సీఐల వరకు విస్తరిస్తుందన్న ప్రచారంతో ఆశావహులు ఎదురుచూస్తున్నారు. దసరా తర్వాత బదిలీల జాబితా వెలువడుతుందా? కీలకస్ట్టేషన్లలో కొత్త ముఖాలు కనిపిస్తాయా? పొరుగు జిల్లాలనుంచి ఎంతమందికి అవకాశం దక్కుతుంది? అన్నది పోలీస్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఎస్‌ఐల ఎపిసోడ్‌ పూర్తి..

సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్ల సీన్‌ మొదలు

వరంగల్‌ కమిషనరేట్‌లో

బదిలీల కలకలం

కీలక ఠాణాలపై గురి..

కొందరి చేతిలో లేఖలు?

పొరుగు జిల్లాలనుంచి

‘ఇన్‌’ అయ్యేందుకూ యత్నాలు..

దసరా తర్వాత మార్పులంటూ

పోలీసు వర్గాల్లో చర్చ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement