వరంగల్ పోలీస్ కమిషనర్‌గా జూలై 1న బాధ్యతలు చేపట్టిన ఎన్.శ్వేత కమిషనరేట్‌పై పట్టు బిగించారు. సీపీగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే మెజార్టీ పోలీస్ స్టేషన్లను విజిట్ చేసి పోలీసులు, అధికారులతో మాట్లాడి యోగక్షేమాలు, శాంతిభద్రతలపై ఆరా తీశారు. సబ్‌డివిజన్లు, పోలీస్ స్టేషన్ల వారీగా నేరాల నమోదు, పరిశోధన, ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న ఆమె నేరుగా బాధితులతో మాట్లాడుతున్నారు. డ్రగ్స్ నియంత్రణకు మహిళా సంఘాల సమన్వయంతో ‘సంఘమిత్ర’ గ్రూపులను ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్, మోసాలు, రోడ్డు ప్రమాదాలు, డ్రంక్‌అండ్‌డ్రైవ్, సైబర్‌క్రైంలపై విద్యాలయాలు, పౌరులతో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు అధికారుల పని తీరుపైనా ఎప్పటికప్పుడు గ్రేడింగ్ చేస్తున్నారు. బదిలీలు, పనిష్‌మెంట్లతో కట్టుదాటితే ఎవరిపైన అయినా చర్యలు తప్పవన్న సంకేతాలు ఇస్తున్నారు.


