కమలాపూర్: ఆడబిడ్డల పెళ్లిళ్లకు కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం కూడా వెంటనే ఇవ్వాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కమలాపూర్ రైతు వేదికలో మండలంలోని వివిధ గ్రామాల లబ్ధిదారులు 81 మందికి రూ.81,09,396 విలువైన 81 కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి సోమవారం ఆయన పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూం ఇళ్లను ఇద్దరు మంత్రులు నిరుపేదలకు పంపిణీ చేశారని, అక్కడ కనీస వసతులు కల్పించక లేక ఏ ఒక్క కుటుంబం కూడా ఆ ఇళ్లల్లో ఉండడం లేదన్నారు. ఏ ఒక్కరైనా డబుల్ బెడ్రూం ఇళ్లల్లో ఉంటున్నట్లు చూపిస్తే ముక్కు భూమికి రాస్తానన్నారు. వెంటనే టెండర్లు పిలిచి మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. కమలాపూర్ బస్టాండ్ నిర్మాణానికి రూ.కోటి, పెద్దమ్మ ఆలయానికి రూ.50 లక్షలు వెంటనే మంంజూరు చేయాలని కోరారు. మరో రెండేళ్లలో వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని, అప్పుడే కరెంటు, నీళ్ల కష్టాలన్నీ తొలగిపోతాయన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సతీశ్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రాజేశ్, ఏఎంసీ చైర్పర్సన్ ఝాన్సీరవీందర్, పీఏసీఎస్ చైర్మన్ సంపత్రావు, తహసీల్దార్ సురేశ్, ఎంపీడీఓ బాబు, జీపీఓ శిరీష, గిర్దావర్ సమ్మయ్య, వివిధ గ్రామాల సర్పంచులు, ఏఎంసీ డైరెక్టర్లు, నాయకులు పాల్గొన్నారు.
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి


