హర్షం వ్యక్తం చేసిన సొసైటీ రైతులు
భీమదేవరపల్లి: ప్రముఖ సహకార రంగ సంస్థ అయిన ములుకనూరు సహకార గ్రామీణ బ్యాంకు (సొసైటీ) పరిధి రైతులకు సోమవారం రూ.3.50 కోట్ల మేర బోనస్ను పాలకవర్గం పంపిణీ చేసింది. మొత్తం ఏడు వేల మందికిపైగా రైతులకు ప్రత్యక్షంగా ఆర్థిక ప్రయోజనం చేకూరింది. ఏటా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని లాభాలను బోనస్ రూపంలో అందించే సంప్రదాయాన్ని సొసైటీ కొనసాగించడంపై రైతాంగం హర్షం వ్యక్తం చేసింది. ఈసందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. సహకార స్ఫూర్తితో పనిచేస్తూ ఎల్లవేళలా అండగా నిలుస్తున్న ములుకనూరు సొసైటీ పాలకవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈబోనస్ ప్రస్తుత వ్యవసాయ పనులకు ఎంతో ఆసరాగా నిలుస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సొసైటీ పాలకవర్గ సభ్యులు కాశిరెడ్డి వసంత, జైపాల్ రెడ్డి, కొమురయ్య, రైతులు పాల్గొన్నారు.


