భ్రమరాంబిక అమ్మవారికి ప్రత్యేక పూజలు | - | Sakshi
Sakshi News home page

భ్రమరాంబిక అమ్మవారికి ప్రత్యేక పూజలు

Oct 12 2026 8:22 AM | Updated on Oct 12 2026 8:22 AM

భ్రమరాంబిక అమ్మవారికి ప్రత్యేక పూజలు నవంబర్‌ 5న వరంగల్‌ ఐఎంఏ ఎన్నికలు నేడు గ్రేటర్‌ గ్రీవెన్స్‌ పల్లె సీను సాహిత్యం యువతకు మార్గదర్శి

ఐనవోలు: మండల కేంద్రంలోని శ్రీ మల్లిఖార్జున స్వామి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు శైలపుత్రి అలంకారంలో భ్రమరాంబిక అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చింది. ఆదివారం ఆలయంలో అమ్మవారికి వేకువజామున సుప్రభాత సేవ, విఘేశ్వర పూజ, శైవశుద్ధి, పుణ్యహవచనం, పంచగవ్య ప్రాశన, ఋత్విక్‌ వరుణ దీక్షాధారణ, అఖండ దీపారాధన, త్రిశూలపూజ, అంకురారోపణ, మంటపారాధన, ప్రధాన కలశస్థాపన, అమ్మవారి నవ కలశ స్నపన సుగంధ పరిమళ ద్రవ్యాభిషేకంతో నవరాత్రి వ్రతారంభం చేసినట్లు అర్చకులు తెలిపారు. అత్యంత విశిష్టమైన అమ్మవారి నవదుర్గ అలంకరణలను 9రోజులు భక్తులు దర్శించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ కందుల సుధాకర్‌, ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్‌, వేద పండిట్‌ విక్రాంత్‌ జోషి, ముఖ్య అర్చకులు పాతర్లపాటి శ్రీనివాస్‌, ఐనవోలు మధుకర్‌ శర్మ, అర్చకులు భాను ప్రసాద్‌, నరేశ్‌, శ్రీనివాస్‌, దేవేందర్‌, సాయి వరుణ్‌, మణిశర్మ పాల్గొన్నారు. ఈసందర్భంగా సీనియర్‌ అసిస్టెంట్‌ కిరణ్‌కుమార్‌, దేవాలయ సిబ్బంది రాజు, లడ్డు రాజు, రఘురాజు, భక్తులు రవితేజ, ప్రదీప్‌, ఉప్పల శ్రీనివాస్‌ అమ్మవారి మాలధారణ చేసినట్లు తెలిపారు.

కాశిబుగ్గ: వరంగల్‌ ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) ఎన్నికలు నవంబర్‌ 5న వరంగల్‌ ఐఎంఏ హాల్‌లో నిర్వహించనున్నట్లు రిటర్నింగ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ నాగార్జునరెడ్డి, కోరిటర్నింగ్‌ ఆఫీసర్లు డాక్టర్‌ బందెల మోహన్‌రావు, డాక్టర్‌ కె.మల్లేశం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్‌ ఫారాలను ఈ నెల 28 నుంచి అందజేస్తామని, 31 వరకు నామినేషన్లకు దాఖలు చేయాలని, నవంబర్‌ 2న నామినేషన్ల స్క్రూటిటీ, 3న విత్‌డ్రా చేసుకోవచ్చని పేర్కొన్నారు. తుది జాబితా విడుదల అనంతరం నవంబర్‌ 5న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఐఎంఏ హాల్‌లో పోలింగ్‌ జరుగుతుందని వివరించారు. కాగా, నూతన కమిటీకి ఒక అధ్యక్షుడు, నలుగురు ఉపాధ్యక్షులు, ఒక జనరల్‌ సెక్రటరీ, నలుగురు జాయింట్‌ సెక్రటరీలు, ఒక ఫైనాన్స్‌ సెక్రటరీ, 24 మంది స్టేట్‌ కౌన్సిల్‌ మెంబర్లు ఎంపిక చేయనున్నారు.

వరంగల్‌ అర్బన్‌: వరంగల్‌ మహా నగర పాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ) ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రేవెన్స్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కమిషనర్‌ టి.వెంకన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రాత పూర్వకంగా దరఖాస్తులను అందజేయాలని కోరారు. సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

హన్మకొండ కల్చరల్‌: పల్లె సీను సాహిత్యం భవిష్యత్‌ తరాలకు ఆమూల్యమైన సాహితీ సంపద అని రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్‌ డాక్టర్‌ రియాజ్‌ అన్నారు. శ్రీలేఖ సాహితి వరంగల్‌ స్వర్ణోత్సవాన్ని పురస్కరించుకుని పల్లె సీను ఐదు పుస్తకాల ఆవిష్కరణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ మేరకు ఆదివారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్‌లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు జరిగిన కార్యక్రమంలో డాక్టర్‌ రియాజ్‌, రిటైర్డ్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ దహగం సాంబమూర్తి అతిథులుగా హాజరై పల్లె సీను రచించిన గగన తరంగాలు, మైత్రీ భావ తరంగాలు, పల్లె అంతరంగం, నేను కవిత్వాన్ని, నా సాహిత్య సంబంధాలు పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పల్లె సీను సాహిత్య యువతకు గొప్ప మార్గదర్శిగా ఉంటుందని, ఆయన ఆలోచనలు సాహిత్యం మూలలను పరిచయం చేస్తుందని, వచన కవిత్వంపై ఆయనకు గొప్ప పట్టు ఉందని అన్నారు. కందుకూరి శ్రీరాములు, ఒద్దిరాజు ప్రవీణ్‌కుమార్‌, టి.ఉడయవర్లు, డాక్టర్‌ పర్చా అంజనీదేవి, డాక్టర్‌ అమ్మిన శ్రీనివాసరాజు, శంకేశి శంకర్రావు, వరిగొండ కాంతారావు, పల్లె నాగేశ్వరరావు, డాక్టర్‌ ఎన్వీఎన్‌చారి, డాక్టర్‌ పల్లేరు వీరస్వామి, పలువురు సాహితీవేత్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement