● మార్కెటింగ్ శాఖ అదనపు సంచాలకుడు ఆర్.లక్ష్మణుడు
ఖిలా వరంగల్: వ్యవసాయ మార్కెట్లలో రైతులకు మెరుగైన సేవలు అందించడం, రైతుల సమస్యల పరిష్కారానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సాఫ్ట్వేర్ను అందుబాటులోకి తీసుకొస్తామని మార్కెటింగ్ శాఖ రాష్ట్ర అదనపు సంచాలకుడు ఆర్.లక్ష్మణుడు అన్నారు. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ను చైర్పర్సన్ ఎర్ర ప్రియాంక, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్రెడ్డి, మార్కెట్ కార్యదర్శి శ్రీనివాస్, డీఎంఓ నాగరాజు, వైస్ చైర్మన్ బండి జనార్దన్, డైరెక్టర్ గజ్జల శ్యాంతో కలిసి శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డు పరిసరాలు, మిర్చి, పత్తి వేలం, తేమ, నాణ్యత, కొనుగోళ్లు, ధరల ప్రక్రియ, పీహెచ్సీలో వైద్యసేవలను పరిశీలించారు. అపరాల యార్డులో ఈ–నామ్ ద్వారా చేపట్టిన క్రయవిక్రయాలను తెలుసుకున్నారు. మొక్కజొన్నల నాణ్యత, వ్యాపారులు కోడ్ చేస్తున్న ధరలను రైతులు, వ్యాపారులను వేర్వేరుగా అడిగి తెలుసుకున్నారు. మార్కెట్ పరిధిలోని పరిశ్రమలకు వెళ్లే గుంతల రోడ్ల పరిస్థితిని చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్రెడ్డి వివరించారు. అనంతరం గీసుకొండ మండలం కొమ్మాల శివారులోని విశ్వనాథపురం గ్రామంలోని ఫ్రూట్స్ మార్కెట్ ఏర్పాటు కోసం ప్రతిపాదిత స్థలాన్ని లక్ష్మణుడు పరిశీలించారు. మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఆకుల రుద్రప్రసాద్, బొడ్డు ప్రదీప్కుమార్, మహమ్మాద్ సాబేర్, చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి మడూరి వేదప్రకాశ్, అడ్తి సెక్షన్ అధ్యక్షుడు ఎన్రెడ్డి లింగారెడ్డి, కాటన్ సెక్షన్ అధ్యక్షుడు చింతలపల్లి వీరారావు, వేలం నిర్వాహకుడు సాగర్ల శ్రీనివాస్, మార్కెట్ సిబ్బంది రాజేందర్ పాల్గొన్నారు.


