హన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి దేవాలయంలో ఈ నెల 11వ తేదీ నుంచి 21 వరకు శ్రీభద్రకాళిదేవీ శరన్నవరాత్ర మహోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నామని ఆలయ ఈఓ రామల సునీత తెలిపారు. గురువారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఉత్సవాల వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతిరోజూ ఉచిత అన్నప్రసాదాల వితరణ, సాయంత్రం 5నుంచి రాత్రి 9గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. 17వతేదీ అమ్మవారికి రథోత్సవం ఉంటుందని చెప్పారు. ఇందుకోసం సుమారు రూ.కోటి వ్యయంతో దారుమయ (టేకు) రథాన్ని దారుశిల్పులు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఆలయ ప్రధానార్చకులు భద్రకాళి శేషు మాట్లాడుతూ రోజూ ప్రాతఃకాల పూజలు, అర్చనలు, వివిధ క్రమాలలో అమ్మవారిని అలంకరించి విశేషసేవలు నిర్వహిస్తామని తెలిపారు.


