గీసుకొండ: మండలానికి చెందిన పొగాకుల శ్రావణి ప్రతిష్టాత్మక ఐసీఏఆర్ ఏఐసీఈ ప్రవేశ పరీక్ష (వ్యవసాయ విస్తరణ విద్యావిభాగం పీహెచ్డీ)లో జాతీయ స్థాయిలో 45వ ర్యాంకు సాధించింది. వ్యవసాయాన్నే జీవనాధారంగా చేసుకున్న తల్లిదండ్రులు భిక్షపతి, సరిత ప్రోత్సాహంతో కష్టాలను అధిగమిస్తూ శ్రావణి ఉన్నత విద్యను కొనసాగించింది. ఆమె పట్టుదల, కృషి ఫలితంగా జాతీయస్థాయి ర్యాంకు సాధించడం గీసుకొండకు గర్వకారణమని పలువురు అభినందించారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
టీజేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అంబటి శ్రీనివాస్
నర్సంపేట: తెలంగాణ జన సమితి (టీజేఎస్) రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నర్సంపేటకు చెందిన అంబటి శ్రీనివాస్‌ను రెండోసారి నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఉత్తర్వులు జారీ చేశారు. 2018లో ఏర్పడిన టీజేఎస్‌కు వ్యవస్థాపక అధ్యక్షుడిగా అంబటి శ్రీనివాస్ వ్యవహరించారు. ధైర్యం, తెగువ, పట్టుదల గమనించిన ప్రొఫెసర్ కోదండరాం.. అంబటి శ్రీనివాస్‌ను రెండోసారి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించారు.
క్రీడా సామగ్రి సరఫరాకు
టెండర్లు : డీఈఓ
కాళోజీ సెంటర్: జిల్లాలోని 16 పీఎంశ్రీ పాఠశాలలకు క్రీడా సామగ్రి సరఫరా చేసేందుకు సీల్డ్ కొటేషన్లు కోరుతున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి రంగయ్యనాయుడు తెలిపారు. ఆసక్తిగల వారు ఈ నెల 9 నుంచి 13వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు డీఈఓ కార్యాలయంలో టెండర్ ఫారాలు పొందవచ్చని పేర్కొన్నారు. పూర్తి చేసిన సీల్డ్ టెండర్ ఫారాలను 13న మధ్యాహ్నం 3 గంటల్లోగా సమర్పించాలని, టెండర్లను 14న కలెక్టర్ కార్యాలయంలో తెరవనున్నట్లు పేర్కొన్నారు.
పోషకాహారం తీసుకోవాలి
చెన్నారావుపేట: ప్రతిఒక్కరూ పోషకాహారం తీసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి రాజమణి అన్నారు. తిమ్మరాయినిపహాడ్ గ్రామంలో గురువారం పోషణ మాస ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆమె హాజరై మాట్లాడుతూ చిరు ధాన్యాలు, పెరటి తోటల్లో పెంచిన ఆకుకూరలు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలని కోరారు. గ్రామంలో పోషకాహర స్టాళ్లను ఏర్పాటు చేశారు. సర్పంచ్ ధారావత్ రమేశ్, సెక్టార్ సూపర్వైజర్ రాధ, ప్రాజెక్టు ఏసీడీపీఓ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
పొరపాట్లు లేకుండా
రీ సర్వే చేయాలి : ఆర్డీఓ
వర్ధన్నపేట: మార్గదర్శకాలకు అనుగుణంగా రీ సర్వే నిర్వహించాలని వరంగల్ ఆర్డీఓ సుమ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. చెన్నారం గ్రామంలో చేపట్టిన భూ రీ సర్వే ప్రక్రియను గురువారం ఆమె పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సర్వే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సందేహాలను నివృత్తి చేశారు. భూ వివరాల నమోదులో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తగా సర్వే పక్రియను పూర్తి చేయాలన్నారు. తహసీల్దార్ విజయసాగర్, సర్వేయర్లు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
‘సూపర్’ ఇన్చార్జ్గా
మాధవరావు కొనసాగింపు
కాశిబుగ్గ: కేఎంసీలో ఆవరణలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి ఇన్చార్జ్ (డిప్యూటీ సూపరింటెండెంట్) బాధ్యతలను నెలకు ఒక ప్రొఫెసర్ చొప్పున అప్పగించడంతో పాలనాపరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ విషయమై ఆగస్టు 24న ‘సూపర్’లో నెలకొకరు!, ఈ నెల 1న సూపర్ డిప్యూటీ బాధ్యతలెవరికో? అనే శీర్షికలతో సాక్షిలో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో ఉన్నతాధికారులు స్పందించినట్లు తెలుస్తోంది. గతంలో అధికారులు నెలకు ఒకరు చొప్పున సీనియర్ ప్రొఫెసర్ ఇన్చార్జ్ బాధ్యతలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. తొలుత డాక్టర్ మాధవరావు ఆగస్టు 15న బాధ్యతలు స్వీకరించారు. అయితే, ఆయన సెప్టెంబర్ చివరి వరకు ఉండాలి. అక్టోబర్ నుంచి కార్డియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ మమతారెడ్డి ఇన్చార్జ్గా వ్యవహరించాల్సి ఉంది. ఆమె ఇన్చార్జ్ బాధ్యతలు తీసుకోవడానికి ముందుకు రానట్లు సమాచారం. అలాగే, ఉన్నతాధికారులు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో డాక్టర్ మాధవరావు ఇన్చార్జ్ గా కొనసాగుతున్నారు.


