గీసుకొండ: టీబీ నియంత్రణ కోసం ప్రతిఒక్కరూ సమష్టిగా కృషిచేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద పిలుపునిచ్చారు. టీబీ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా జాయింట్ స్క్వాడ్ ఫర్ హెల్త్ (జోష్) టీంల కార్యక్రమాన్ని కలెక్టర్ డాక్టర్ సత్యశారద గురు వారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, రాత్రిపూట చెమట, బరువు తగ్గడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దన్నారు. అనుమానితులు సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో కఫం పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. టీబీ నిర్ధారణ అయితే ప్రభుత్వ ఆస్పత్రులో ఉచితంగా అందించే చికిత్సను పూర్తిగా తీసుకుంటే వ్యాధి నయమవుతుందన్నారు. గ్రామాల్లో టీబీపై అవగాహన కల్పించడంతో పాటు స్క్రీనింగ్ శిబిరాలు నిర్వహించి అనుమానితులను గుర్తించడంలో జోష్ టీంలు, ఎన్్సీసీ కేడెట్లు, యువత కీలకపాత్ర పోషించాలని కోరారు. అనంతరం టీబీ రహిత గ్రామాలుగా గుర్తింపు పొందిన చాపలబండ, దేశాయిపల్లి, చెన్నారం, కాశిగూడెం, లోహిత, నల్లబెల్లి గ్రామాల సర్పంచ్లను కలెక్టర్, డీఎంహెచ్ఓ డాక్టర్ బి.రాజారెడ్డి సన్మానించి సర్టిఫికెట్లు అందజేశారు. నర్సంపేట ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యారాణి, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ఐ. ప్రకాశ్, డాక్టర్ ఆర్.రాజమౌళి, డాక్టర్ సాజిదా, డాక్టర్ అరుణ్ జోషి, డిప్యూటీ డెమో ఎస్.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ సత్యశారద


