● కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదేశం
● పరకాల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి
తనిఖీ
పరకాల: పరకాల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో వైద్యసేవలు, వసతులు మెరుగ్గా ఉండాలని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదేశించారు. గురువారం పరకాలలో నూతనంగా అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో వైద్యసేవలతో పాటు వివిధ విభాగాల్లో వసతులను పరిశీలించారు. జనరల్ మేల్, ఫిమేల్వార్డులను సందర్శించి చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్యసేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి పక్కనే నిర్మితమవుతున్న భవనాన్ని ఉపయోగించుకునే అవకాశాన్ని పరిశీలించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆయా విభాగాల పేర్లను సూచించే విధంగా సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలని సూపరింటెండెంట్ డాక్టర్ వంశీ కృష్ణను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆర్ఎంలు డాక్టర్ నారాయణ, డాక్టర్ బాలకృష్ణ, పరకాల మున్సిపల్ కమిషనర్ పోతరాజు పవన్, ఆర్టీఓ డీఎస్ వెంకన్న, టీజీ ఎంఎస్ఐడీసీ నందు పటేల్, తహసీల్దార్ విజయలక్ష్మి, ఆర్‌అండ్‌టీ డీఈ లోరిన, అధికారులు పాల్గొన్నారు.
రోడ్డు ఆక్రమణలపై కలెక్టర్ సీరియస్
హసన్‌పర్తి: ప్రధాన రహదారి వెంట ఫుట్‌పాత్‌లను కబ్జా చేసుకోవడంపై కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ సీరియసయ్యారు. ఆక్రమణలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. మూడు రోజుల్లో వచ్చి పరిశీలిస్తానని చెప్పారు. గురువారం బల్దియా కమిషనర్ వెంకన్నతో కలిసి గోపాలపురం కల్లుమండువా, జంక్షన్, చింతగట్టు క్యాంప్, రామారం, కాకతీయ యూనివర్సిటీ రెండో గేట్, భీమారం ప్రాంతాలను సందర్శించారు. రోడ్డు పరిస్థితి, ట్రాఫిక్ నిర్వహణ, ఆక్రమణలు, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. రహదారులకు ఇరువైపులా బిల్‌బోర్డులు, ఫ్లెక్సీలు, డబ్బాలు ఏర్పాటు చేయడంపై కలెక్టర్ సీరియసయ్యారు. ఆయా ప్రాంతాల్లో అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించారు. టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. ప్రధాన రహదారి వెంట ఆక్రమణల వల్ల ట్రాఫిక్ సమస్య తలెత్తడంతోపాటు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆక్రమణల తొలగింపు పనులు సత్వరం చేపట్టాలని ఆదేశించారు. ప్రధాన రహదారులు, కూడళ్ల వద్ద పరిశుభ్రత పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ నగరాన్ని శుభ్రంగా ఉంచాలని సూచించారు. డివైడర్లు, మీడియంల మరమ్మతులను వెంటనే చేపట్టాలన్నారు. కార్యక్రమంలో సీహెచ్ఓ రాజారెడ్డి, ఎస్ఈ రాజ్‌కుమార్, అధికారులు లక్ష్మారెడ్డి, రవీందర్, శంకర్, ఈవికుమార్ పాల్గొన్నారు.


