న్యూశాయంపేట: నీటి పారుదల, రైల్వే ప్రాజెక్టు, దేవాదుల ప్రాజెక్టు పనుల పురోగతి, రాష్ట్రంలోని ప్రగతి, పీఎంజీ ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ అంశాలపై బుధవారం ఢిల్లీ నుంచి భారత ప్రభుత్వ కేబినెట్ సెక్రటేరియేట్ కార్యదర్శి మనోజ్ గోవిల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు హైదరాబాద్ నుంచి, కలెక్టరేట్ నుంచి కలెక్టర్ డాక్టర్ సత్యశారద, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
టీజీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌గా మమత
నెక్కొండ: మండల కేంద్రంలోని టీజీ గురుకుల పాఠశాల/కళాశాల ప్రిన్సిపాల్‌గా మమతకు బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారని గురుకుల ప్రత్యేక అధికారి, ఎంపీడీఓ యాసం లావణ్య బుధవారం తెలిపారు. టీచర్ రజిని విద్యార్థినులను విచక్షణ రహితంగా దండించిన విషయాన్ని గోప్యంగా ఉంచడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిపిందే. అలాగే, విధుల్లో నిర్లక్ష్యం వహించడం కారణంగా ప్రిన్సిపాల్ బాధ్యతల నుంచి శ్రీదేవిని తప్పించి మమతకు అప్పగించారని ఆమె పేర్కొన్నారు.
నేడు ఆయిల్‌పామ్ రైతులకు అవగాహన సదస్సు
గీసుకొండ: కొనాయమాకులలోని పీడీఆర్ గార్డెన్స్‌లో గురువారం ఆయిల్‌పామ్ రైతులకు అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు ఆయిల్‌పామ్ రైతుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నంద్యాల కృష్ణారెడ్డి, వెంకటరెడ్డి తెలిపారు. మండల కేంద్రంలో బుధవారం వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. సదస్సుకు ఐసీఏఆర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎంవీ ప్రసాద్, డీహెచ్ఎస్ఓ ఆర్.శ్రీనివాస్‌రావు, శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ఆర్ రాజు హాజరవుతారని పేర్కొన్నారు. ఆయిల్‌పామ్ సాగు, రైతుల సమస్యలు, సంబంధిత అంశాలపై అవగాహన కల్పిస్తారని వివరించారు. రైతులు అధిక సంఖ్యలో హాజరై సదస్సును విజయవంతం చేయాలని కోరారు. అసోసియేషన్ జిల్లా కోశాధికారి బాబురావు, గీసుకొండ మండల కమిటీ అధ్యక్షుడు రఘుపతిరెడ్డి పాల్గొన్నారు.
శాసీ్త్రయ విజ్ఞానాన్ని
పెంపొందించేందుకు కృషి
నర్సంపేట: ప్రజల్లో శాసీ్త్రయ విజ్ఞానాన్ని పెంపొందించడానికి జనవిజ్ఞాన వేదిక నిరంతరం కృషి చేస్తుందని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర పరిశీలకుడు శ్రీనాథ్ అన్నారు. పట్టణంలోని సదాశివహాల్లో బుధవారం జనవిజ్ఞాన వేదిక జిల్లా ఆరో మహా సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైన్స్ సాధించిన ఫలితాలు, శాస్త్రజ్ఞులు కనుగొన్న వివిధ శాసీ్త్రయ పరిశోధనలను ప్రజల చెంతకు తీసుకెళ్లాలని సూచించారు. బాలబాలికల్లో శాసీ్త్రయ అవగాహన పెంపొందించడం కోసం, మూఢ నమ్మకాలకు దూరంగా, అవసరమైన కనీస పరిజ్ఞానాన్ని అందించడం కోసం ప్రతి సంవత్సరం నవంబర్‌లో చెకుముకి పోటీలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈనెల 10, 11 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కోరారు.
జనవిజ్ఞాన వేదిక జిల్లా నూతన కమిటీ
గౌరవ అధ్యక్షులుగా డాక్టర్ వీఎం జయుడు, ఐ.రామకృష్ణ, జిల్లా అధ్యక్షుడిగా గుగులోత్ సుధాకర్, ప్రధాన కార్యదర్శిగా పాక శ్రీనివాస్, కోశాధికారిగా బూరుగు నవీన్, ఉపాధ్యక్షులుగా వి.మాధవి, వి.శ్యాం, పాల కుమారస్వామి, కార్యదర్శులుగా సమ్మెట సురేశ్, పెరుమాండ్ల కుమార్‌రెడ్డి, ఆర్.సంతోష్‌కుమార్, సబ్ కమిటీల కన్వీనర్లుగా డాక్టర్ బి.శంకర్, చాగంటి యాకయ్య, వి.మాధవి, మోతె ఇంద్రసేనారెడ్డి, డాక్టర్ పెండెం భాస్కర్, ఎండీ రాయబోస్, ఎల్.కిష్టయ్య, కె.నీలాద్రి, వి.మాధవరెడ్డి ఎన్నికయ్యారు.
మార్కెట్‌కు రెండు
రోజులు సెలవు
ఖిలా వరంగల్: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు ఈనెల 10, 11 తేదీల్లో సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ చైర్పర్సన్ ఎర్ర ప్రియాంక బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 10న అమావాస్య, 11న వారాంతపు సెలవు కావడంతో యార్డు బంద్ ఉండనుందని పేర్కొన్నారు. మార్కెట్ తిరిగి 12వ తేదీన పునఃప్రారంభమవుతుందని తెలిపారు. రైతులు తేదీలను గమనించాలని, సెలవుల్లో మార్కెట్‌కు సరుకులు తేవొద్దని ఆమె కోరారు.


