వేలేరు: కాజీపేట రైల్వేస్టేషన్ సమీపంలో తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితికి చేరిన వ్యక్తికి సకాలంలో ప్రథమ చికిత్స అందించి ప్రాణాలు కాపాడిన 108 సిబ్బందికి లైఫ్ సేవియర్ అవార్డు లభించింది. రైల్వే రక్షణ దళం హెడ్ కానిస్టేబుల్ సమాచారం మేరకు.. 108 సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని రక్తస్రావాన్ని నియంత్రించి అత్యవసర ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈసందర్భంగా పైలట్ కుంట రవి, అత్యవసర వైద్య సాంకేతిక నిపుణుడు చైతన్యకు సంస్థ తరఫున లైఫ్ సేవియర్ అవార్డు అందజేశారు. హనుమకొండ జిల్లా కార్యక్రమ నిర్వాహకుడు శివకుమార్, శ్రీనివాస్ ఆధ్వర్యంలో కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, డీఎంహెచ్ఓ అప్పయ్య చేతుల మీదుగా అవార్డును అందజేశారు.
విద్యారణ్యపురి: ప్రణాళికాబద్ధంగా చదివితేనే విజయం సాధించవచ్చని వరంగల్ నిట్ గణిత విభాగం ప్రొఫెసర్ కె.కళాధర్ విద్యార్థులకు సూచించారు. బుధవారం హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గణితశాస్త్ర విబాగం ఆధ్వర్యంలో ఐఐటీ, నిట్లో మాస్టర్ డిగ్రీల ప్రవేశాల కోసం జామ్ (జాయింట్ అడ్మిషన్స్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ ఇన్ ఐఐటీ,నిట్)పై అవగాహన కార్యక్రమంలో ఆయన పలు సూచనలిచ్చారు. కార్యక్రమంలో కేడీసీ ప్రిన్సిపాల్ గుర్రం శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్ రజనీలత గణిత విభాగాఽధిపతి డాక్టర్ ఇ.కొమురయ్య, అధ్యాపకులు సత్యనారాయణ, డి.వెంకన్న, మంగమ్మ, ఎ.శ్రీనాథ్, అనిల్కుమార్ హరిప్రసాద్, రోహిణి, వేణు పాల్గొన్నారు.
హసన్పర్తి: విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభ, నైపుణ్యాలు గుర్తించి వాటిని సరైన దిశలో ప్రోత్సహించడమే కౌశల్ బోఽధ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని డీఈఓ గిరిరాజ్గౌడ్ అన్నారు. హసన్పర్తి మండలం భీమారంలోని స్కిల్ స్టార్క్ ఇంటర్నేషనల్ పాఠశాలలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి కౌశల్ బోధ ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమం బుధవారం ముగిసింది. ముఖ్య అతిథిగా హాజరైన డీఈఓ మాట్లాడుతూ విద్యార్థుల్లో ప్రత్యేక ప్రతిభ దాగి ఉంటోందని, ఉపాధ్యాయులు వాటిని గమనించి వెలికితీయాల్సిన అవసరం ఉందన్నారు. ఈసందర్భంగా శిక్షణలో పాల్గొన్న రిసోర్స్పర్సన్లు, ఉపాధ్యాయులకు ప్రశంసపత్రాలు అందించారు. కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాస్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
ఖిలా వరంగల్: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్కు రెండు రోజుల పాటు అక్టోబర్ 10, 11 తేదీల్లో సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ చైర్పర్సన్ ఎర్ర ప్రియాంక బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 10న అమావాస్య, 11న వారాంతపు సెలవు కావడంతో యార్డు బంద్ ఉండనుందని పేర్కొన్నారు. మార్కెట్ తిరిగి 12వ తేదీన పునఃప్రారంభమవుతుందని తెలిపారు. రైతులు తేదీలను గమనించాలని, సెలవుల్లో మార్కెట్కు సరుకులు తీసుకొచ్చి ఇబ్బందులకు గురికావొద్దని చైర్పర్సన్ కోరారు.
హన్మకొండ అర్బన్ : జిల్లాలోని రెవెన్యూ శాఖలో పలువురు ఉద్యోగులకు పరిపాలనా సౌలభ్యం కోసం స్థానచలనం కల్పిస్తూ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కె.అమరేందర్ హనుమకొండ కలెక్టరేట్నుంచి భీమదేవరపల్లి తహసీల్దార్ కార్యాలయానికి, బీవీ నెహ్రూ భీమదేవరపల్లి నుంచి ఐనవోలు ఆర్ఐ కార్యాలయానికి, ఆర్.రాణి ఐనవోలు నుంచి హనుమకొండ కలెక్టరేట్కు, చాడా స్వాతికి హనుమకొండ కలెక్టరేట్ నుంచి హసన్పర్తి ఆర్ఐ కార్యాలయానికి స్థానచలనం కల్పించారు.


