గీసుకొండ: జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) పరిధిలోని వివిధ పోస్టులను కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనల మేరకు ఈనెల 9వ తేదీ సాయంత్రం 5గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. నియామక ప్రక్రియ మెరిట్, రోస్టర్, ప్రభుత్వ నిర్దేశించిన నిబంధనల మేరకు పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్లను మాత్రమే నమ్మాలని, అనధికార వ్యక్తులు, దళారుల మాటలు నమ్మి డబ్బులు చెల్లించి మోసపోవద్దని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కోరారు.
వన్యప్రాణుల సంరక్షణ ప్రతీఒక్కరి బాధ్యత
నల్లబెల్లి: వన్యప్రాణుల సంరక్షణ ప్రతీఒక్కరి బాధ్యతని నర్సంపేట ఎఫ్‌ఆర్‌ఓ నరేష్ అన్నారు. ఈ మేరకు మండలంలోని మేడపల్లి హైస్కూల్‌లో విద్యార్థులకు అవగాహన కల్పించారు. అడవులు, వన్య ప్రాణుల సంరక్షణతో పర్యావరణ సమతుల్యతను కాపాడవచ్చని, వన్యప్రాణులను వేటాడడం, వాటిని హాని కలిగించడం చట్టరీత్యా నేరమన్నారు. వన్య ప్రాణలులు గ్రామాలు, జనావాసాల్లోకి వచ్చినప్పుడు వాటిని భయపెట్టకుండా అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలన్నారు. అంతకు ముందు వన్యప్రాణుల సంరక్షణ, వా టి ప్రాధాన్యత అంశంపై వ్యాచరచన పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం కృష్ణమూర్తి, సెక్షన్ ఆఫీసర్ పద్మరావు, బీట్ ఆఫీసర్ కిరణ్, బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు.
రాజీవ్ ఆరోగ్యశ్రీ
జిల్లా కమిటీ ఎన్నిక
గీసుకొండ: తెలంగాణ రాజీవ్ ఆరోగ్య శ్రీ జిల్లా కమిటీని సోమవారం ఎన్నుకున్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని 33 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో నూతన కమిటీలను ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా కొండపర్తి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శిగా కుమారస్వామి, ఉపాధ్యక్షులుగా మో టి మహేష్‌తో పాటు రాష్ట్ర కమిటీ కార్యవర్గ సభ్యుడిగా నల్లబెల్లి అనిల్ ఎన్నికయ్యారు.
పత్తి పంటను పరిశీలించిన శాస్త్రవేత్తలు
దుగ్గొండి/నర్సంపేట రూరల్: దుగ్గొండి మండలంలోని వెంకటాపురం, నర్సంపేట మండలంలోని మహేశ్వరం గ్రామాల్లో అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేసిన పత్తి పంటలను జాతీయ పత్తి పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా నాగపూర్ పత్తి పరిశోధన స్థానం శాస్త్రవేత్త ప్రియాంక గైక్వాడ్ మాట్లాడారు. అధిక సాంద్రత పద్ధతిలో పత్తి పంట సాగులో అధిక మొక్కలు ఉండి, పత్తి ఒకేసారి పక్వానికి వస్తుందన్నారు. దిగుబడి కూడా గణనీయంగా పెరుగుతుందన్నారు. రాబోయే సంవత్సరంలో రైతులు అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేసేవిధంగా చూడాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి విజయనిర్మల, టెక్నికల్ ఏఓ కృష్ణారెడ్డి, ఏఓ శ్యామ్, శ్రీనివాస్, కల్పన, రైతులు దరావత్ శ్రీను, లింగమూర్తి, రాజు, ఏఈఓలు హనుమంతు, వైజయంతి, భారతి, విజయ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
జ్వరంతో నిండు గర్భిణి మృతి
● ఆదివారం కడుపులోని
శిశువు మృత్యువాత
నర్సంపేట రూరల్ : జ్వరంతో బాధపడుతున్న ఓ నిండు గర్భిణి చికిత్స పొందుతూ సోమవారం చనిపోయింది. ఈ ఘటన నర్సంపేట మండలం చంద్రయ్యపల్లి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. చంద్రయ్యపల్లి గ్రామానికి చెందిన నిడిగొండ నవ్య (24)– ఈశ్వర్ దంపతులకు మొదటి బాబు జన్మించారు. బాబుకు ప్రస్తుతం నాలుగేళ్లు ఉన్నాయి. నవ్య ప్రస్తుతం తొమ్మిది నెలల గర్భవతి. పదిరోజుల క్రితం తీవ్ర జ్వరంతో బాధపడుతుండగా నర్సంపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్య చికిత్సలు అందించి ఇంటికి తీసుకెళ్లారు. ఎంతకు జ్వరం తగ్గకపోవడంతో మూడు రోజుల క్రితం వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆదివారం నవ్య గర్భంలో ఉన్న శిశువు మృతిచెందింది. సోమవారం చికిత్స పొందుతూ నవ్య చనిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


