హన్మకొండ అర్బన్: ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, మేధావులు, విద్యార్థులు ఐక్యంగా పోరాడాలని ఎమ్మెల్యే నా యిని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకా శ్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి, ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల ఆధ్వర్యంలో సోమవారం హనుమకొండ జిల్లా కేంద్రంలో ప్రజా స్వామ్య పరిరక్షణ శంఖారావం నిర్వహించారు. అంబేడ్కర్ సెంటర్ నుంచి హనుమకొండ కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ చేపట్టి, అనంతరం కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్‌ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని, తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలని కోరారు. ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్.నాగరాజు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ స్వయంప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘం వ్యవస్థను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. అనంతరం కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌కి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి జి.ప్రభాకర్‌రెడ్డి, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం కార్యకర్తలు పాల్గొన్నారు.


