కడుపులో బిడ్డ.. కత్తెర కోత! | - | Sakshi
Sakshi News home page

కడుపులో బిడ్డ.. కత్తెర కోత!

Oct 6 2026 1:18 AM | Updated on Oct 6 2026 1:18 AM

సాక్షి ప్రతినిధి, వరంగల్‌:

కడుపులోని బిడ్డ బయటికి రావాలంటే కోత తప్పడం లేదు. గర్భిణులకు ఒకప్పుడు సుఖ ప్రసవం (నార్మల్‌ డెలివరీ) జరిగేది. కానీ, నేడు సహజ ప్రసవాల స్థానంలో సిజేరియన్‌ సంఖ్య గణనీయంగా పెరిగింది. ఉమ్మడి వరంగల్‌లోని పలు జిల్లాల్లో ప్రతీ పది ప్రసవాల్లో ఏడుకు పైగా సిజేరియన్లే నమోదవుతున్నాయి. ముఖ్యంగా ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఈ వాటా ఏకంగా 80శాతం దాటగా, వరంగల్‌ 89.6, జనగామ 89.5 శాతంతో సెంచరీ మార్కుకు చేరువగా ఉన్నాయి. మిగిలిన నాలుగు జిల్లాల్లోనూ ఈ వాటా 80 శాతానికి పైగానే ఉంది. నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే–6 (2023–24) గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి.

నాలుగు జిల్లాల్లో 70 శాతం పైనే!..

సీ–సెక్షన్ల (సిజేరియన్లు) వాటా ఉమ్మడి వరంగల్‌ నాలుగు జిల్లాల్లో 70 శాతాన్ని దాటింది. హనుమకొండ జిల్లా 74.1 శాతంతో ముందంజలో ఉండగా.. జయశంకర్‌ భూపాలపల్లి 70.4 శాతం, జనగామ 70.2 శాతం, మహబూబాబాద్‌ 70.1 శాతం నమోదయ్యాయి. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా కనిపిస్తోంది. ఉమ్మడి వరంగల్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో సిజేరియన్ల వాటా 80 శాతాన్ని దాటింది. జనగామ, వరంగల్‌ జిల్లాల్లో ఈ వాటా దాదాపు 90 శాతానికి చేరువైంది. జనగామలో 89.5 శాతం, వరంగల్‌లో 89.6 శాతం నమోదైంది. మహబూబాబాద్‌లో 87.5 శాతం, హనుమకొండలో 82.7 శాతం, భూపాలపల్లిలో 82.6 శాతం, ములుగులో 81.9 శాతం ఉన్నాయి. అంటే ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో జరిగే ప్రతీ పది ప్రసవాల్లో ఎనిమిదికి పైగా సీ–సెక్షన్లే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కాగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సహజ ప్రసవాల వాటా ప్రైవేట్‌తో పోలిస్తే ఎక్కువగా ఉన్నప్పటికీ.. సీ–సెక్షన్ల శాతం మాత్రం గణనీయంగానే ఉంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ కొన్ని జిల్లాల్లో ప్రతీ పది ప్రసవాల్లో ఆరు వరకు సిజేరియన్లు నమోదవుతున్నాయి.

ప్రసవాలన్నీ దవాఖానాల్లోనే..

హనుమకొండలో ఆస్పత్రి ప్రసవాలు 100 శాతం నమోదయ్యాయి. అంటే ప్రసవాల కోసం ఆస్పత్రులను ఆశ్రయించే పరిస్థితి పూర్తిగా ఏర్పడినప్పటికీ.. అదే సమయంలో సిజేరియన్ల వాటా 74.1 శాతానికి చేరడం ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అంశంగా మారింది. ఆస్పత్రి ప్రసవాల పెరుగుదల తల్లి, శిశువుల భద్రతకు అనుకూలమైన పరిణామమే. గర్భిణులకు ప్రసవానికి ముందునుంచే సుఖ ప్రసవం, సిజేరియన్‌ అవసరం అయ్యే పరిస్థితులు, ప్రసవ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్పష్టమైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

ఉమ్మడి జిల్లాలో ప్రతీ పది ప్రసవాల్లో ఏడూ సీ–సెక్షన్లే

సహజ ప్రసవాల (నార్మల్‌

డెలివరీ)కు ససేమిరా..!

ప్రసవాలన్నీ ఆస్పత్రుల్లోనే.. అయినా పెరుగుతున్న ఆపరేషన్ల వాటా..

ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో

80శాతానికి పైనే.. ప్రభుత్వ దవాఖానాల్లో 40–64 శాతం

నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే–6 (2023–24) గణాంకాలు వెల్లడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement