● తమ భూమి తమకు ఇప్పించాలని నిరసన
శాయంపేట: మండలంలోని గోవిందాపూర్ గ్రామానికి చెందిన అడప దేవేంద్ర, రోడ్డ రామచందర్ తమకు వారసత్వంగా వచ్చిన భూమిని తమకే ఇవ్వాలని సోమవారం పోలీస్స్టేషన్ ఎదుట బైఠాయించారు. ఈసందర్భంగా దేవేంద్ర, రామచందర్ మాట్లాడుతూ.. తమ భూమి సర్వే నంబర్లు 678/1, 678/ఏ లో ఉన్న నాలుగెకరాల భూమిని కుటుంబ అవసరాల నిమిత్తం విక్రయించేందుకు సిద్ధపడగా.. ఆరె మొగిలి చింతనిప్పుల భద్రయ్య, బొత్త కుమారస్వామి అడ్డుపడుతున్నారని వాపోయారు. ఈవిషయమై గ్రామ పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించినప్పటికీ కొనుగోలుదారు నుంచి తమకు రావాల్సిన డబ్బులు అందకుండా మధ్యవర్తులు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాయిదాల పద్ధతిలో కొంత మొత్తం చెల్లించినప్పటికీ మిగతా డబ్బులు సర్వే నంబర్లో తప్పు ఉందంటూ తమను పోలీస్ స్టేషన్కు పిలించారని పేర్కొన్నారు. పోలీస్స్టేషన్లో తమపై ఒత్తిడి తెచ్చి మూడు రోజుల పాటు పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతూ కేసులు నమోదు చేస్తామని బెదిరిస్తున్నారన్నారు. సర్వే నంబర్లో తప్పు ఉన్న విషయం గుర్తించిన నేపథ్యంలో భూ విక్రయానికి సంబంధించి తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు తాము సిద్ధంగా ఉన్నప్పటికీ సంబంధిత వ్యక్తులు డబ్బులు స్వీకరించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. కుటుంబ సభ్యులకు పూర్తి సమాచారం లేకుండానే మధ్యవర్తులు భూమి విక్రయానికి ప్రేరేపించారని ఇదిలా ఉండగా.. సబంధింత వ్యక్తులు తమ భూమిలోకి ప్రవేశించి ట్రాక్టర్తో దున్నుతున్నారని పేర్కొన్నారు. ఈవిషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చినప్పటికీ స్పందించలేదని వాపోయారు. తమ భూమి విషయంలో అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు.
కేసు నమోదు
శాయంపేట : మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదుట కొంత మంది మహిళలు, పురుషులు రోడ్డుపై కూర్చొని వాహనాదారులను, ప్రజలను అడ్డుకొని ఇబ్బందులకు గురిచేశారని, వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పరమేశ్ తెలిపారు. సోమవారం సాయంత్రం భూపాలపల్లికి చెందిన రొడ్డ రామచందర్, రోడ్డ సరోజన, రోడ్డ శ్యామల, మండలంలోని గోవిందాపూర్ గ్రామానికి చెందిన అడప దేవేంద్రలు రోడ్డుపై కూర్చొని వాహనదారులను, సామాన్య ప్రజలను అడ్డుకొని ఆటంకం కలిగించారని తెలిపారు. పోలీస్ సిబ్బందిని కూడా అడ్డగించి వారి విధులకు ఆటంకం కలిగించారని, వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై పేర్కొన్నారు.


