స్వల్పంగా పెరిగిన | - | Sakshi
Sakshi News home page

స్వల్పంగా పెరిగిన

Oct 5 2026 1:27 AM | Updated on Oct 5 2026 1:27 AM

524.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

భూగర్భ జలాలు

సెప్టెంబర్‌లో జిల్లా సగటు నీటిమట్టం 5.98 మీటర్లు

● జిల్లాలో లోటు వర్షపాతం

హన్మకొండ: వర్షాభావ పరిస్థితుల్లోనూ భూగర్భ జలాలు స్వల్పంగా పెరగడం రైతులకు ఊరటనిస్తోంది. జిల్లాలో 36శాతం లోటు వర్షంపాతం నమోదైనా భూగర్భ జలాలు స్వల్పంగా పెరిగాయి. భూమి ఉపరితలం నుంచి చూస్తే సెప్టెంబర్‌ మాసాంతంలో 5.98 మీటర్ల వద్ద భూగర్భ జలమట్టం ఉంది. జిల్లాలో 25 ప్రాంతాల్లో ఫీజో మీటర్ల ద్వారా నమోదైన భూగర్భ జలమట్టం వివరాలను భూగర్భజల శాఖ ప్రతినెలా చివరి వారంలో సేకరిస్తుంది. నైరుతి రుతుపవనాలకు ముందు సీజన్‌ మే మాసాంతంలో హనుమకొండ జిల్లా సగటు భూగర్భ జలమట్టం 6.17 మీటర్లు. జూన్‌ నాటికి 7.25 మీటర్లు, జూలై నాటికి 7.71 మీటర్లకు భూగర్భ జలమట్టం పడిపోయింది. ఆగస్టు, సెప్టెంబర్‌ మాసంలో క్రమంగా భూగర్భ జలమట్టం పెరిగింది. ఆగస్టులో 6.83 మీటర్లకు, సెప్టెంబర్‌ మాసాంతానికి అది 5.98 మీటర్లకు చేరుకుంది. గతేడాది సెప్టెంబర్‌ మాసాంతంలో 3.40 మీటర్ల లోతులోనే భూగర్భ జలాలున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి 2.58 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. ఈ ఏడాది జూలై మాసాంతంతో పోలిస్తే సెప్టెంబర్‌ మాసాంతానికి 1.73 మీటర్లు, ఆగస్టుతో పోలిస్తే 0.85 మీటర్లు భూగర్భ జలాలు వృద్ధి చెందాయి. గతేడాదితో పోల్చుకుంటే భూగర్భజలాలు ఈసారి పడిపోయి ఉండడం నీటి ఎద్దడికి సూచికగా కనిపిస్తోంది.

2,13,435 ఎకరాల్లో పంటల సాగు

జిల్లాలో అన్ని పంటలు కలిపి గతేడాది వానాకాలంలో 2,27,957 ఎకరాల్లో సాగు చేయగా, ఈ వానాకాలంలో 2,13,435 ఎకరాల్లో సాగైంది. 14,522 ఎకరాలు తక్కువ సాగు చేశారు. ఇందులో వరి గతేడాది 1,45,601 ఎకరాల్లో సాగు చేయగా.. ఈ వానాకాలంలో 1,20,446 ఎకరాల్లో సాగు చేశారు. మొక్కజొన్న గతేడాది 7,080 ఎకరాల్లో సాగు చేయగా ఈ ఏడాది 8,444 ఎకరాలు, పప్పు దినుసులు గతేడాది 395 ఎకరాలు కాగా, ఈ ఏడాది 4,486 ఎకరాలు, నూనె గింజలు గతేడాది 32 ఎకరాలు, ప్రస్తుతం 309 ఎకరాలు, పత్తి గతేడాది 74,849 ఎకరాల్లో సాగు చేయగా ఈ ఏడాది 75,747 ఎకరాల్లో సాగు చేశారు. గతేడాది కంటే వరి 25,155 ఎకరాల్లో తక్కువ సాగైంది. దీంతో భూగర్భ జల వినియోగం కొంత మేర తగ్గింది. దీనికితోడు గతనెల 24, 25 తేదీల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. చెరువులు, కుంటల్లోకి స్వల్పంగా నీరు చేరింది. దీంతో భూగర్భ జలాల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది.

జిల్లాలో ఈనెల 3వ తేదీ వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 824.5 మిల్లీ మీటర్లు కాగా, ఇప్పటి వరకు 524.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో సగటున 36 శాతం లోటు వర్షపాతం నెలకొంది. జిల్లాలోని 14 మండలాల్లో ఒక మండలంలో 50 శాతం లోటు ఉండగా 5 మండలాల్లో 41 నుంచి 49 శాతం లోటు ఉంది. మిగతా మండలాల్లో 17 నుంచి 37 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. జిల్లాలో నడికూడ మండలం చర్లపల్లిలో అత్యధికంగా 13.32 మీటర్ల లోతులో భూగర్భ జలాలున్నాయి. భీమదేవరపల్లి మండలం వంగరలో 11.60 మీటర్ల లోతులో, హసన్‌పర్తి మండలం నాగారంలో 10.82 మీటర్ల లోతులో, పెద్ద పెండ్యాలలో 10.23 మీటర్ల లోతులో ఉండగా, ధర్మసాగర్‌లో అత్యంత పైన 1.50 మీటర్ల లోతులో ఉన్నాయి.

ప్రాంతాల వారీగా భూగర్భ జలమట్టం వివరాలు (మీటర్ల లోతులో)

గ్రామం మార్చి ఏప్రిల్‌ మే జూన్‌ జూలై ఆగస్టు సెప్టెంబర్‌

ధర్మసాగర్‌ 1.47 1.81 3.10 2.8 2.25 1.96 1,5

ఎల్కతుర్తి 6.50 7.10 7.40 7,25 7.85 8.45 8.62

హనుమకొండ 5.30 5.30 6.50 7.00 6.9 5.4 4.78

ఐనవోలు 4.40 5.30 5.50 5,2 5.95 4.05 2.48

వేలేరు 4.00 5.40 6.15 5.7 8.47 3.78 4.05

ఆత్మకూరు 2.15 1.48 3.20 3.3 3.57 2.95 2.47

దామెర 4.10 6.50 6.60 6.71 7.27 6.1 6.37

నడికూడ 0.80 1.20 2.50 3.02 2.9 2.3 2.08

పరకాల 2.70 2.70 3.10 3.08 3.51 2.1 2.01

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement