పీహెచ్‌సీ అప్‌గ్రేడేషన్‌ కలేనా..? | - | Sakshi
Sakshi News home page

పీహెచ్‌సీ అప్‌గ్రేడేషన్‌ కలేనా..?

Oct 4 2026 11:01 AM | Updated on Oct 4 2026 11:01 AM

పీహెచ్‌సీ అప్‌గ్రేడేషన్‌ కలేనా..?

ఆస్పత్రి సమయంలోనే వైద్యం

పేదలకు ఇబ్బందులు

● దశాబ్దాలుగా ప్రజల ఎదురుచూపు

పర్వతగిరి : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేస్తామన్న గత ప్రభుత్వ హామీ అమలు కలేనా? అంటూ మండల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ పాలనలో నాటి మంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, అరూరి రమేష్‌ హామీ ఇవ్వగా తదనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆస్పత్రి అప్‌గ్రేడేషన్‌ దిశగా ఇప్పటివరకు చర్యలు చేపట్టలేదు. అనేక ఏళ్లుగా మండల ప్రజలు ఎదురు చూస్తుండగా ప్రస్తుత ప్రభుత్వం, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు చొరవ చూపడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మండలంలో 33 గ్రామాలు, సుమారు 50 వేలకుపైగా జనాభా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. పీహెచ్‌సీకి ప్రతిరోజూ వందలాది మంది రోగులు ఓపీకి వచ్చి వైద్యం చేయించుకుంటున్నారు. మెరుగైన వైద్యసేవల కోసం పీహెచ్‌సీ వైద్యులు, సిబ్బంది రోగులను వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి రెఫర్‌ చేయడం హెచ్‌సీ ఏర్పాటు నాటి నుంచి ఆనవాయితీగా మారింద. పీహెచ్‌సీని 30 పడకలకు ఉన్నతీకరించాలని అనేక ఏళ్లపాటు మండల ప్రజాప్రతినిధులు, ప్రజలు అధికారులను కోరగా ఎట్టకేలకు గత బీఆర్‌ఎస్‌ పాలనలో నాటి మంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు దయాకర్‌రావు, అరూరి రమేష్‌ సానుకూలంగా స్పందించారు. త్వరలోనే ఆస్పత్రిని ఉన్నతీకరిస్తామని ప్రకటించి ఆ దిశగా కార్యాచరణ చేపట్టారు. తదనంతరం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది.

వర్షాకాలంలో మరింత ఇబ్బంది

ఏటా వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధుల బారిన పడే ప్రజలు పీహెచ్‌సీకి వచ్చి వైద్యులకు చూపించుకుని మందులు తీసుకుని వెళ్లాల్సి వస్తోంది. రోగ తీవ్రత ఉన్న వారిని వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి వెళ్లాలని పీహెచ్‌సీ వైద్యులు, సిబ్బంది సూచిస్తుండగా గత్యంతరం లేక రోగులు ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి వెళ్లాలంటే సుమారు 35 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుండడం ఇబ్బందికర పరిణామం.

పీహెచ్‌సీలో కేవలం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మాత్రమే వైద్యం అందుతోంది. సాయంత్రం నుంచి ఉదయం ఆస్పత్రి తెరిచే వరకు అత్యవసర పరిస్థితి ఉంటే ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. పీహెచ్‌సీని 30 పడకలకు ఉన్నతీకరించే విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం స్పందించాలి.

– గుడ్ల శ్రీధర్‌, గ్రామస్తుడు, పర్వతగిరి

సీజనల్‌, ఇతర వ్యాధులతో బాధపడుతున్న పేదలకు ఇబ్బందులు ఎదురౌతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో పీహెచ్‌సీ మూసి ఉంటుండగా పెద్దమొత్తంలో డబ్బు వెచ్చించి ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లలేని పేద ఎస్సీ, ఎస్టీలు సరైన వైద్యం చేయించుకోలేకపోతున్నారు. ప్రభుత్వం పీహెచ్‌సీని 30 పడకలకు ఉన్నతీకరించే దిశగా చొరవ చూపాలి.

– గటిక మల్లయ్య, గ్రామస్తుడు, చింతనెక్కొండ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement