నత్తనడకన నర్సింగ్‌ కళాశాల నిర్మాణం | - | Sakshi
Sakshi News home page

నత్తనడకన నర్సింగ్‌ కళాశాల నిర్మాణం

Jun 16 2026 1:34 AM | Updated on Jun 16 2026 1:34 AM

శంకుస్థాపన వేసి ఏడు నెలలు గడిచినా

బెడ్‌ లెవల్‌లోనే పనులు

త్వరగా పూర్తిచేయాలని కోరుతున్న నర్సింగ్‌ విద్యార్థులు

నర్సంపేట రూరల్‌: నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాల భవన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. శంకుస్థాపన చేసి ఏడు నెలలు కావొస్తున్నా ఇప్పటి వరకు బెడ్‌ లేవల్‌కే పనులు పరిమితం అయ్యాయి. ఇలా అయితే భవనం పూర్తయ్యేది ఎప్పుడు, విద్యార్థులకు అందుబాటులోకి వచ్చేదెప్పుడు అని పలువురు ప్రశ్నిస్తున్నారు. నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రి (కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌)కి రోజురోజుకు రోగుల తాకిడి పెరుగుతోంది. రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే ఉద్దేశంతోనే వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు 2018 సంవత్సరంలో 250 పడకలతో జిల్లా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేశారు. దాత ప్రముఖ వ్యాపారవేత్త దొడ్డమోహన్‌రావు ప్రభుత్వానికి 20 ఎకరాల భూమిని కొనుగోలుచేసి అందించారు. అందులో 10 ఎకరాల భూమిని ఆస్పత్రి కేటాయించగా మూడు బ్లాక్‌లతో నూతన భవనాల నిర్మాణం చేపట్టారు. 2022లో నర్సంపేట జిల్లా ఆస్పత్రిని 350 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేశారు. 2024–25 సంవత్సరంలో నూతనంగా నిర్మించిన భవనంలో రెండు బ్లాక్‌లను ప్రారంభించి వైద్య కళాశాల, ఆస్పత్రి సేవలను ప్రారంభించారు. అదే సంవత్సరంలో నర్సింగ్‌ కళాశాల మొదటి బ్యాచ్‌ను 50 మంది విద్యార్థులతో ప్రారంభించారు. గీసుకొండ మండలంలోని గంగదేవిపల్లి గ్రామంలో భవనం అద్దెకు తీసుకొని నర్సింగ్‌ కళాశాలను ఏర్పాటు చేసి తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం రెండు బ్యాచ్‌లు పూర్తయ్యాయి. మరో రెండుమూడు నెలల్లో కొత్త బ్యాచ్‌ వచ్చే అవకాశం ఉంది. నర్సంపేట వైద్యకళాశాలకు ప్రభుత్వం 10 ఎకరాల భూమిని కేటాయించగా.. అందులో నుంచి నాలుగున్నర ఎకరాల భూమిని రెవెన్యూ సిబ్బంది నర్సింగ్‌ కళాశాలకు కేటాయించారు. గత సంవత్సరం డిసెంబర్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా రూ.26 కోట్లతో నర్సింగ్‌ కళాశాల భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసి ఏడు నెలలు గడుస్తున్నా పనులు మాత్రం నత్తనడకనే సాగుతున్నాయి. ఇప్పటి వరకు కనీసం బెడ్‌ లేవల్‌కే పరిమితమయ్యాయి.

గంగదేవిపల్లికి టు నర్సంపేటకు

నర్సింగ్‌ విద్యార్థుల అప్‌ అండ్‌ డౌన్‌..

నర్సంపేట వైద్య కళాశాలకు అనుబంధంగా నర్సింగ్‌ కళాశాల, పారా మెడికల్‌ కళాశాలను ప్రభుత్వం మంజూరు చేసింది. నర్సింగ్‌ కళాశాలకు భవన సదుపాయం లేకపోవడంతో గీసుకొండ మండలంలోని గంగదేవిపల్లి వద్ద ఉన్న భవనంలోనే నర్సింగ్‌ తరగతులు, ప్రాక్టికల్స్‌ మాత్రం నర్సంపేట ఆస్పత్రిలో నిర్వహిస్తున్నారు. ప్రాక్టికల్స్‌ కోసం విద్యార్థులు గంగదేవిపల్లి నుంచి నర్సంపేటకు రావాలంటే తిప్పలు తప్పడం లేదు. కళాశాల ప్రిన్సిపాల్‌ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా బస్సును ఏర్పాటుచేసి రావాల్సి వస్తోంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి త్వరగానే పనులను వేగవంతం చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. ఈ పనులపై ఏఈ నరేశ్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement