● కలెక్టర్ డాక్టర్ సత్యశారద
ఖిలా వరంగల్: యువకులు నిర్లక్ష్యంగా, వేగంగా డ్రైవ్ చేయొద్దని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా వరంగల్ గవిచర్ల క్రాస్‌రోడ్డు, ఉప్పరపల్లి క్రాస్‌రోడ్డు వద్ద జిల్లా రవాణాశాఖ ఇన్‌చార్జ్ ఆర్టీఓ శోభన్‌బాబు ఆధ్వర్యంలో శనివారం అరైవ్–అలైవ్ కార్యక్రమం ముగింపు సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా కలెక్టర్ హాజరై మాట్లాడుతూ డ్రైవర్లు జాగ్రత్తగా వాహనాలను నడిపి ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చాలని పేర్కొన్నారు. మత్తు పానీయాలు సేవించకూడదని, ఏకాగ్రతతో రోడ్డు పై దృష్టిసారించి వాహనాన్ని నడుపాలన్నారు. తెల్ల వారుజామున, సాయంత్రం ఆరు గంటల తర్వాత ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు. అందరి భాగస్వామ్యంతోనే రోడ్డు ప్రమాదాల నివారణకు పాటుపడాలని కోరారు.
జనగణన పారదర్శకంగా చేయాలి
వర్ధన్నపేట: జనగణన పారదర్శకంగా చేపట్టాలని, ఇంటింటా ఎన్యుమరేటర్లు తిరిగి వివరాలు నమో దు చేయాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. వర్ధన్నపేట రైతువేదికలో శనివారం జనగణన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. ముందుగా ఇళ్ల జాబితా, జనగణన నమోదు చేసుకోవడానికి ప్రభుత్వం అందించిన అధికారిక యాప్‌ను ఉపయోగించాలని సూచించారు. కుటుంబ వివరాలను పారదర్శకంగా సేకరించి నమోదు చేయాలని ఆదేశించారు. శిక్షణ కార్యక్రమంలో తహసీల్దార్ విజయసాగర్, ఎంపీడీఓ వెంకటరమణ పాల్గొన్నారు.
సాండ్‌బజార్‌కు
స్థ్థల సేకరణ చేయాలి..
న్యూశాయంపేట: వర్ధన్నపేట మండలం కట్య్రాల సమీపంలో సాండ్‌బజార్‌కు సుమారు ఐదు ఎకరాలు, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కోసం స్థల సేకరణ చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద కోరారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో వర్థన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ సుమ, వర్ధన్నపేట తహసీల్దార్ విజయసాగర్, అధికారులు పాల్గొన్నారు.


