సత్వర వైద్యసేవలతో టీబీకి చెక్‌ | - | Sakshi
Sakshi News home page

సత్వర వైద్యసేవలతో టీబీకి చెక్‌

Mar 24 2026 6:47 AM | Updated on Mar 24 2026 6:47 AM

సరిగా అందని సహాయం

టీబీ రోగులకు కేంద్ర ప్రభుత్వం నిక్షయ్‌ పోషన్‌ యోజన కింద నెలకు రూ.వెయ్యి చొప్పున ఆరు నెలల పాటు రూ.6 వేల సహాయం అందిస్తుంది. అయితే గతేడాది ఈ పథకం కింద జిల్లాకు రూ.12 లక్షల నిధులు రాగా, 193 మందికి పంపిణీ చేసినట్లు వైద్యాధికారులు తెలిపారు. కేంద్రం ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం సరిగా విడుదల చేయకపోవడంతో అర్హులైన రోగులకు ఆర్థిక సహాయం అందడం లేదని బాధితులు వాపోతున్నారు.

జిల్లాలో మూడు పరీక్ష కేంద్రాలు

గతేడాది 1,263, ఈ ఏడాది ఇప్పటివరకు 298 పాజిటివ్‌ కేసులు

ఆరు నెలల పాటు చికిత్స పొందితే జబ్బు నయం

నేడు ప్రపంచ క్షయ (టీబీ) వ్యాధి నివారణ దినోత్సవం

గీసుకొండ: దగ్గు, తుమ్ముల ద్వారా క్షయ వ్యాధి ఇతరులకు సోకే ప్రమాదం ఉన్నా వ్యాధిగ్రస్తులు ఆరు నెలల పాటు సరైన చికిత్స పొందితే ఈ వ్యాధి నుంచి ఉపశమనం పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు. వాడుక భాషలో టీబీ (ట్యూబర్‌క్యులోసిస్‌)గా పిలిచే క్షయ వ్యాధి ప్రాణాంతకమే అయినా దీని నివారణకు సరైన చికిత్స విధానం ఉంది. ఇది మైకో బ్యాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్‌ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ప్రధానంగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. అలాగే వెన్నెముక, మెదడు, మూత్రపిండాలు తదితర అవయవాలపై కూడా దీని ప్రభావం ఉంటుందని వైద్యులు అంటున్నారు.

క్షయ వ్యాధి లక్షణాలు

దగ్గు, జ్వరం రావడం, ఆకలి సరిగా లేకపోవడం, బరువు తగ్గడం, రక్తంతో కూడిన దగ్గు రావడం, రాత్రి పూట చెమటలు పట్టడం, కఫంలో రక్తం పడడం వంటి లక్షణాలు రెండు వారాలకు మించి ఉంటే అలాంటి వారు తప్పనిసరిగా టీబీ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్న పిల్లలు, వృద్ధుల్లో టీబీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మధుమేహం, కిడ్నీ, హెచ్‌ఐవీ వ్యాధులతో బాధపడేవారికి టీబీ వచ్చే అవకాశం ఉంటుంది.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

క్షయ వ్యాధి ఒకరినుంచి వేరొకరికి సంక్రమించే అవకాశం ఉంది. అందువల్ల తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని వైద్యులు చెబుతున్నారు. వ్యాధిగ్రస్తులు ఎక్కువగా వెలుతురు ఉన్న గదుల్లో జీవించాలని, మూసి ఉన్న చీకటి గదుల్లో బ్యాక్టీరియా సులభంగా వ్యాపించే ప్రమాదం ఉందని అంటున్నారు. వ్యాధి సోకిన వారితో ఇతర వ్యక్తులు కలిసి ఉండటం, నిద్రించడం చేయవద్దని వైద్యులు సూచిస్తున్నారు.

వ్యాధి నిర్ధారణ పరీక్షలు

క్షయ వ్యాధి నిర్ధారణకు కఫం పరీక్ష చేస్తారు. ఊపిరితిత్తుల నుంచి కఫాన్ని సేకరించి సీబీనాట్‌, ట్రూనాట్‌ అనే రెండు రకాల పరీక్షలు చేస్తారు. ఈ పరీక్షలను బయట చేయించుకుంటే ఒక్కో దానికి సుమారు రూ.3 వేల వరకు ఖర్చు అవుతుందని, ప్రభుత్వ పరీక్షా కేంద్రాల్లో అయితే ఉచితంగా చేయించుకోవచ్చని వైద్యాధికారులు తెలిపారు. వ్యాధి నిర్ధారణ అయిన వారు క్రమం తప్పకుండా కనీసం 6 నుంచి 9 నెలల వరకు వైద్యుల సలహా మేరకు టీబీ నివారణ మందులు తీసుకుంటూ ఉండాలి. యాంటీ బయాటిక్స్‌ ఐసోనియాజిడ్‌, పిఫాంపిన్‌, ఇతాంబుటోల్‌, పిరజినైమైడ్‌ మందులు వాడాలని వైద్యులు సూచిస్తున్నారు.

జిల్లాలో మూడు పరీక్ష కేంద్రాలు

జిల్లాలోని ఎంజీఎం వద్ద గల టీబీ సెంటర్‌, నర్సంపేట మెడికల్‌ కళాశాలలోని టీబీ సెంటర్‌, వర్దన్నపేటలోని సీహెచ్‌సీలో టీబీ నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేస్తారు. గతేడాది జిల్లావ్యాప్తంగా 73,990 మందికి పరీక్షలు చేయగా 1,263 మందికి టీబీ నిర్ధారణ అయింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 3,800 మందికి పరీక్షలు చేయగా 298 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో సుమారు 875 మంది టీబీ సోకిన వారు చికిత్స పొందుతున్నారు. ఈ విభాగానికి జిల్లా ప్రోగ్రాం అధికారిగా డాక్టర్‌ అరుణ్‌కుమార్‌ జోషి వ్యవహరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement