నాంపల్లి కోర్టుకు మంత్రి కొండా సురేఖ
రామన్నపేట: 2023 శాసనసభ ఎన్నికల్లో మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌లో ధర్నా సందర్భంగా నమోదైన కేసులో గురువారం మంత్రి కొండా సురేఖ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఆమె వెంట టీపీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాశ్, కాంగ్రెస్ నాయకులు అయూబ్ మహ్మద్, వాసీం అయూబ్ ఉన్నారు.
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో పీజీ కోర్సుల మూడో సెమిస్టర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. గురువారం యూనివర్సిటీలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కళాశాలతోపాటు హనుమకొండలోని పలు పరీక్ష కేంద్రాలను కేయూ పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ పి.శ్రీనివాస్ సందర్శించి పరీక్షలు నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు.
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయాన్ని యునెస్కోలో చేర్చాలని, ‘కుడా’ నిధులతో దేవాలయ పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి అన్నారు. వేయిస్తంభాల ఆలయ ఈఓ అనిల్‌కుమార్, ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ గురువారం రాత్రి ‘కుడా’ చైర్మన్‌ను కలిసి దేవాలయ అభివృద్ధి పనులపై, శివరాత్రి ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై చర్చించి ఉత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వానించారు.
కాజీపేట అర్బన్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఉన్న ఫ్రాంకింగ్ మిషన్లు పనిచేయడం లేదు. సుమారు నెల రోజులుగా బ్యాంకులో లోన్లు, ఆస్తికి తగ్గట్లు దస్తావేజుపై స్టాంప్ డ్యూటీ ఫ్రాంకింగ్ మిషన్ల ద్వారా అందడం లేదు. వరంగల్ ఆర్‌ఓ, వరంగల్ రూరల్, వరంగల్ ఫోర్ట్, జనగామ, స్టేషన్ ఘన్‌పూర్‌లోని ఫ్రాంకింగ్ మిషన్లు పని చేయక తప్పనిసరి పరిస్థితుల్లో హైదరాబాద్‌కు వెళ్లాల్సి వస్తోంది. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు తక్షణమే మిషన్లను అందుబాటులోకి తీసుకురావాలని బ్యాంకు రుణ దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎంజీఎం: విద్యుత్ అంతరాయం కారణంగా ఎంజీఎం ఆస్పత్రి అత్యవసర విభాగంలోని సీటీ స్కాన్ పరికరం సేవలు 40 నిమిషాల పాటు నిలిచిపోయాయి. సీటీ స్కాన్ పరికరానికి జనరేటర్ ద్వారా విద్యుత్ సౌకర్యం కల్పించాల్సి ఉంది. కానీ, సాంకేతిక లోపాల వల్ల సీటీ సేవలు నిలిచిపోవడంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కోక తప్పలేదు. ఈ విషయంపై ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ హరీశ్చంద్రారెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరగా.. సీటీ స్కాన్ పరికరానికి జనరేటర్ అందుబాటులో లేని విషయం పరిశీలిస్తున్నామన్నారు. రోగులకు సేవల్లో అంతరాయం కలగకుండా మెరుగైన వైద్యసేవలందిస్తామన్నారు. కాగా, గతంలో ఎంజీఎంలోని అన్ని అత్యవసర విభా గాలకు జనరేటర్‌తో 24 గంటల సేవలు అందుబాటులో ఉండేలా ప్రతిపాదనలు రూపొందించినప్పటికీ కార్యాచరణకు నోచుకోలే దు.
న్యూశాయంపేట: తెలంగాణ మైనార్టీ గురుకులాల విద్యాసంస్థలు(టెమ్రిస్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్(సీఓఈ) కళాశాలల్లో ప్రవేశానికి రేపు (శనివారం) ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి వరంగల్ జిల్లా కో–ఆర్డినేటర్ డాక్టర్ జె.సతీశ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బాలికలకు నగరంలోని వరంగల్(జీ1), హనుమకొండ కేయూ క్రాస్‌రోడ్, బాలురకు వరంగల్(జీ2) వరంగల్, దూపకుంటరోడ్డు, శంభునిపేటలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రెండు కేంద్రాల్లో కలిపి 1,038 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు తెలిపారు.
నాంపల్లి కోర్టుకు మంత్రి కొండా సురేఖ


