అలసిపోతున్న బాల్యం
చదువుకోసం ప్రతీరోజు కిలోమీటర్ల మేర నడక
గ్రౌండ్ రిపోర్ట్
సమయానికి రాని బస్సు
● బడికి నడక తప్పదంటున్న విద్యార్థులు
● సైకిళ్లను వినియోగిస్తున్న మరికొందరు..
● బస్సు ఉన్నా పాటించని సమయపాలన
● పట్టించుకోని అధికారులు, పాలకులు
● ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులు
విద్యార్థులతో వెళ్తున్న ఆటో
రాగన్నగూడెం నుంచి సైకిళ్లపై రాయపర్తి పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులు
బడికి వెళ్లాలంటే ఇబ్బంది పడాల్సిందే..
శాయంపేట : మండలంలోని నేరుడపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో 63 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఈ పాఠశాలకు ఆత్మకూరు మండలంలోని కటాక్షపూర్, హౌజ్ బుజర్జ్ గ్రామాల నుంచి సుమారు 53 మంది విద్యార్థులు వస్తుంటారు. వీరంతా పాఠశాలకు రావాలంటే బస్సు సమయానికి రాకపోవడంతో రెండు కిలోమీటర్లకు పైగా కొందరు విద్యార్థులు కాలినడకన వస్తుండగా.. మరికొందరు తమ తల్లిదండ్రుల వాహనాలపై లేదా.. వాహనదారులను లిఫ్ట్ అడిగి పాఠశాలకు చేరుకుంటున్నారు. కొందరు విద్యార్థులు ఆర్టీసీ బస్సులో వస్తున్నారు.
బడికెళ్లి చదువుకోవాలంటే విద్యార్థులకు నడకే శరణ్యమైంది. సమయానికి బస్సులు రాకపో వడంతో కొందరు.. అసలు వాహనాలే అందుబాటులో లేక మరికొందరు విద్యార్థులు తప్పనిసరి పరిస్థితుల్లో నడిచి పాఠశాలలకు వెళ్తున్నారు. దీంతో శారీరకంగా అలసిపోయి చదువుపై శ్రద్ధ పెట్టలేకవెనుకబడిపోతున్నారు.
విద్యార్థులకు తప్పని తిప్పలు
నల్లబెల్లి: మండలంలోని శంషాబాద్ గ్రామానికి చెందిన 12 మంది చిన్నారులు కన్నారావుపేట ప్రాథమిక పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు. అయితే వీరికి రవాణా సౌకర్యం లేకపోవడంతో ప్రతీ రోజు రెండు కిలోమీటర్ల మేర కాలినడకన పాఠశాలకు చేరుకుంటున్నారు. నిత్యం వ్యవసాయ పనులు, కూలీ పనులు చేసుకునే తల్లిదండ్రులు పిల్లలు చదువుకోవాలని ఆరాటపడుతున్నా.. వారి భద్రతను తలుచుకుని వణికిపోతున్నారు. ప్రతీరోజు నాలుగు కిలోమీటర్లు నడిచి బడికి వెళ్లి వచ్చాక అలసిపోయిన పిల్లలు చదువుపై దృష్టిసారించలేకపోతున్నారని, అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి కనీసం చిన్నారుల కోసం ఆటోసౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.
ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు
రాయపర్తి: మండలంలో పలు గ్రామాలకు బస్సు సౌకర్యం ఉన్నప్పటికీ సమయానికి రాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. సమయానికి పాఠశాలకు చేరుకోవాలనే ఉద్దేశంతో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. మరికొందరు విద్యార్థులు సైకిళ్ల పై పాఠశాలకు వెళ్తున్నా రు. కొత్తూరు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్‌మీడి యం బోధించడంతో బంధనపల్లి, సూర్యతండా, ఏకేతండా గ్రామాల నుంచి సుమారు 100 నుంచి 150 మంది విద్యార్థులు వస్తుంటారు. ఈ పాఠశాలకు బస్సు సౌకర్యం ఇటీవలికాలంలోనే ప్రారంభించినా.. సమయానికి రాకపోవడంతో ప్రైవేట్ వామనాల్లోనే విద్యార్థులు బడికి వెళ్తున్నారు. మండలంలోని కొండూరు పాఠశాలకు బురహాన్‌పల్లి, జింకురాం తండా, బోజ్యానాయక్ తండా, గన్నా రం తదితర గ్రామాల నుంచి ఆటోలు, కాలినడకన, టాటాఏస్ వాహనాలు, సైకిళ్లపై వస్తుంటా రు. రాయపర్తి హైస్కూల్‌కి రాగన్నగూడెం, మహబూబ్‌నగర్, జేతురాం తండా, గుబ్బడితండా, రావుల తండా తదితర గ్రామాల నుంచి సైకిళ్లు, ఆటోలు, టాటాఏస్ వాహనాల్లో వస్తుంటారు.
అలసిపోతున్న బాల్యం
అలసిపోతున్న బాల్యం
అలసిపోతున్న బాల్యం


