మున్సి‘పాలిటిక్స్’
సాక్షి, వరంగల్: జిల్లాలో ఎన్నికలు జరగనున్న నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీల్లో గెలుపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీలు సై అంటే సై అంటున్నాయి. అయితే పట్టణాల్లో కొంతమేర ఓటు బ్యాంక్ కలిగిన బీజేపీ సైతం తాము కూడా ప్రతిష్టాత్మక పోరుకు సిద్ధమనే సంకేతాలు ఇస్తుండడంతో పురపాలిక ఎన్నికలు ఈసారి రసవత్తరంగా జరిగే అవకాశం కనబడుతోంది. 30 వార్డులున్న నర్సంపేట మున్సిపాలిటీలో చైర్మన్ స్థానం బీసీ మహిళ, 12 వార్డులున్న వర్ధన్నపేట మున్సిపాలిటీలో చైర్మన్ జనరల్‌కు రిజర్వేషన్ రావడంతో ఆసక్తిని రేపుతోంది. ఓవైపు కౌన్సిలర్ పదవిపై కన్నేసిన అభ్యర్థులు, కీలకమైన చైర్మన్ పదవికి కూడా తాము లైన్‌లో ఉన్నామనే సంకేతాలు పంపుతున్నారు. ఇటు కాంగ్రెస్, అటు బీఆర్‌ఎస్ పార్టీలో ఈ హడావుడి ఉండడంతో ఎన్నికల ఖర్చు కూడా భారీగా ఉండొచ్చన్న చర్చ జరుగుతోంది.
భర్తలకు అవకాశమున్నా భార్యలే బరిలోకి..
నర్సంపేట మున్సిపాలిటీలో తాజా మాజీ కౌన్సిలర్ 25వ వార్డు నుంచి పోటీ చేస్తున్న పెండెం లక్ష్మీ రామానంద్, 21వ వార్డు నుంచి తాజా మాజీ కౌన్సిలర్ ఓర్సు అంజలి అశోక్ అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి చైర్మన్ సీటును ఆశిస్తున్నారనే చర్చ జరుగుతోంది. 21వ వార్డు నుంచి ఓర్సు అశోక్ బరిలో దిగే అవకాశమున్నా కూడా చైర్మన్ బీసీ మహిళకు కేటాయించడంతో భార్య అంజలిని పోటీకి దింపుతున్నారనే చర్చ ఉంది. ఇక బీసీ జనరల్ రిజర్వ్ అయిన 29వ వార్డు నుంచి ప్రస్తుత బీఆర్‌ఎస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ నాగెళ్లి వెంటకనారాయణ్ పోటీ చేసే అవకాశమున్నా బీఆర్‌ఎస్ పార్టీ నుంచి చైర్మన్ పదవీ కోసం ఆయన భార్య నాగెల్లి పద్మను బరిలోకి దింపుతున్నారు. అలాగే బీసీ జనరల్ రిజర్వ్ అయిన పదో వార్డు నుంచి నాగిశెట్టి ప్రసాద్ పోటీ చేసే అవకాశమున్నా అతని భార్య తాజా మాజీ కౌన్సిలర్ నాగిశెట్టి పద్మను చైర్మన్ పదవీ కోసం బరిలోకి దింపుతున్నారు. ఇలా రాజకీయంగా తాము పోటీ చేసే అవకాశమున్నా చైర్మన్ పదవీ కోసం భర్తలు వారి భార్యలను బరిలోకి దింపుతుండడంతో నర్సంపేట రాజకీయం రసవత్తరంగా సాగుతోంది.
వర్ధన్నపేటలో విచిత్ర పరిస్థితి..
వర్ధన్నపేట మున్సిపాలిటీలోని డీసీ తండా పరిధిలోకి వచ్చే నాలుగు, ఐదు, ఆరు వార్డుల్లో ఎస్టీ జనాభానే ఉంటుంది. ఈ వార్డులు జనరల్, జనరల్ మహిళకు కేటాయించడంతో ఇక్కడ నుంచి కూడా ఎస్టీ అభ్యర్థులే పోటీ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ జనాభా ఎస్టీలే ఉండడంతో జనరల్ అభ్యర్థులు వచ్చి పోటీ చేసినా గెలవడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే ఎస్సీలు, వడ్డెరలు ఎక్కువగా ఉండే ఏడో వార్డు ఎస్టీ జనరల్‌కు, ఎస్సీ సామాజిక వర్గం ఎక్కువగా ఉండే రెండో వార్డు ఎస్టీ మహిళకు, ఓసీ కుటుంబాలు ఎక్కువగా ఉండే ఎనిమిదో వార్డు ఎస్టీ జనరల్‌కు కేటాయించడంతో ఇక్కడి నుంచి తప్పనిసరి పరిస్థితుల్లో పోటీకి వారికే అవకాశం ఉండడంతో ఈ మూడు సీట్లు వారికే దక్కనున్నాయి. దీంతో 12 వార్డులున్న మున్సిపాలిటీలో ఎస్టీల సంఖ్యాబలం ఆరుగా మారే అవకాశముంది. వర్ధన్నపేట చైర్మన్ పదవీ జనరల్‌కు కేటాయించినా ఎస్టీల్లో ఏ పార్టీకి చెందినవారిని చైర్మన్ చేసుకోవాలన్న ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే 1, 12 వార్డులు ఎస్సీ జనరల్, ఎస్సీ మహిళ, 11వ వార్డు బీసీ జనరల్, ఆరు రిజర్వేషన్ స్థానాలు వచ్చిన జనరల్‌లో ఎస్టీ జనాభా ఉన్న మూడు వార్డులు మినహాయిస్తే మూడో వార్డు జనరల్, 9, 10 వార్డులు జనరల్ మహిళకు రిజర్వ్ కేటాయించారు. వీటిలోనూ పదో వార్డు, మూడో వార్డుల్లో ఎస్సీ జనాభా ఎక్కువ ఉండడంతో వారు పోటీ చేసే అవకాశం కనబడుతోంది. దీంతో ఇక్కడ చైర్మన్ పదవి జనరల్‌కు వచ్చినా ఓసీలు చైర్మన్ కావడం కష్టమనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో వినబడుతోంది. అందుకే ఇక్కడ పోటీచేసే అభ్యర్థులు తాము చైర్మన్ బరిలో ఉన్నామనే సంకేతాలు స్పష్టంగా ఇవ్వలేకపోతున్నారు.
చైర్మన్ పీఠంపై నేతల గురి
నర్సంపేట మున్సిపాలిటీలో
మొదలైన రాజకీయం
భర్తలకు అవకాశమున్నా..
రంగంలోకి భార్యలు
చైర్మన్ స్థానం మహిళకు రిజర్వ్ కావడంతో నేతల నిర్ణయం
జనరల్ రిజర్వ్ అయిన వర్ధన్నపేటలో విచిత్ర పరిస్థితి
వార్డుల రిజర్వేషన్లతో మారిన
రాజకీయ ముఖచిత్రం
మున్సి‘పాలిటిక్స్’
మున్సి‘పాలిటిక్స్’


