ము
న్యూస్‌రీల్
వరంగల్
శనివారం శ్రీ 13 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
జాతర పనులు పూర్తి చేయాలి
మేడారం మహా జాతర పనులన్నీ త్వరగా పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో విచిత్ర పరిస్థితి
సాక్షి, వరంగల్: మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ముఖ్య నాయకులకు ఊహించని ఫలితాలు వచ్చాయి. పర్వతగిరి, రాయపర్తి, వర్ధన్నపేట మండలాల వివిధ పార్టీల అధ్యక్షుల సొంత గ్రామాల్లో ప్రతికూల ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్ వర్ధన్నపేట మండల అధ్యక్షుడు ఇల్లంద సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓడిపోయారు. కొన్నిచోట్ల కాంగ్రెస్ రెబల్స్ కాంగ్రెస్ అభ్యర్థులపైనా విజయఢంకా మోగించారు. ఫలితాలను విశ్లేషించుకుంటున్న ఎమ్మెల్యేలు, ఇతర పార్టీల ముఖ్యులు రెండు, మూడు దశల ఎన్నికల్లో ఇంకా మెరుగైన ఫలితాలు రాబట్టాలని ఆలోచన చేస్తున్నారు. రాయపర్తి మండలంలోని 40 పంచాయతీలకు కాంగ్రెస్ 27, బీఆర్‌ఎస్ 9, స్వతంత్రులు నలుగురు, వర్ధన్నపేట మండలంలోని 18 పంచాయతీలకు కాంగ్రెస్ 10, బీఆర్‌ఎస్ ఐదు, బీజేపీ ఒకటి, స్వతంత్రులు రెండు, పర్వతగిరి మండలంలో 33 పంచాయతీల్లో కాంగ్రెస్ 19, బీఆర్‌ఎస్ 12, స్వతంత్రులు రెండు గెలిచారు. స్వతంత్రుల్లో నలుగురు కాంగ్రెస్ రెబల్స్ అభ్యర్థులుగా బరిలో నిలిచారు.
కాంగ్రెస్ రెబల్స్ హవా..
● రాయపర్తి మేజర్ గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి గారె సహేంద్ర భిక్షపతి 1,051 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈమెకు 2065 ఓట్లు రాగా.. సమీప కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి కుంట వినోదకు 1,005 ఓట్లు, బీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థి చందు లక్ష్మికి 756 ఓట్లు వచ్చాయి.
● బురహాన్‌పల్లి గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి సూదిల ఉమ 155 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈమెకు 560 ఓట్లు రాగా, సమీప కాంగ్రెస్ బలపర్చిన కూస కవితకు 405 ఓట్లు వచ్చాయి. బీఆర్‌ఎస్ బలపర్చిన జంగిలి మాధవికి 300 ఓట్లు వచ్చాయి. గతంలో సూదిల ఉమ భర్త దేవేందర్ ఇదే గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా పనిచేశారు. పదవీ కాలం ముగిసిన తర్వాత భూతగాదాల కేసులో ఆయన హత్యకు గురయ్యారు.
● ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పీఏ బిర్రు రాజు భార్య మౌనిక కాంగ్రెస్ మద్దతుతో వర్ధన్నపేట మండలం నల్లబెల్లి సర్పంచ్‌గా బరిలోకి దిగారు. రెబల్ అభ్యర్థి జక్కి అనిత 851 ఓట్లతో గెలిచారు. మౌనికకు 761 ఓట్లు వచ్చాయి.
● వర్ధన్నపేట మండలం దివిటిపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి ఏడుదొడ్ల అహల్యదేవికి 318 ఓట్లు వచ్చాయి. సమీప కాంగ్రెస్ అభ్యర్థి కర్క నరసింహారెడ్డికి 279 ఓట్లు వచ్చాయి.
అమ్మమ్మపై మనవరాలి గెలుపు..
● వర్ధన్నపేట మండలం కట్య్రాల (ఎస్టీ మహిళ)లో బీజేపీ బలపర్చిన రాయపురం రమ్య 9 ఓట్లతో గెలిచారు. బీఆర్‌ఎస్ బలపరిచిన సుల్తాన్ పోషమ్మకు ఈమె మనవరాలు (బిడ్డ బిడ్డ) కావడం గమనార్హం. రమ్యకు 720 ఓట్లు, కాంగ్రెస్ బలపర్చిన సుల్తాన్ దుర్గమ్మకు 721 ఓట్లు వచ్చాయి. రమ్య అమ్మమ్మకు 359 ఓట్లు వచ్చాయి.
● చెన్నారంలో కాంగ్రెస్ బలపర్చిన చిందం లలిత సర్పంచ్‌గా గెలిచారు. ఆమె భర్త వార్డు మెంబర్‌గా గెలిచి ఉపసర్పంచ్ అవుదామని అనుకుంటే వార్డు మెంబర్‌గా ఓడిపోయాడు.
● పర్వతగిరి మండలం మూడెత్తుల తండా సర్పంచ్‌గా మూడు లకుపతి 21 ఓట్లతో గెలిచారు. గత ఎన్నికల్లో ఆయన భార్య జ్యోతి సర్పంచ్‌గా గెలిచి సేవలందించారు.
‘టాస్’తో వరించిన అదృష్టం..
వర్ధన్నపేట మండలం అంబేడ్కర్‌నగర్ ఒకటో వార్డులో కాంగ్రెస్ బలపర్చిన గోపల రూపకు 31, బొక్కల రజనికి 31 ఓట్లు వచ్చాయి. అధికారులు టాస్ వేయగా రూప గెలిచింది. కొత్తపల్లిలో తొమ్మిదో వార్డు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థులు అనుముల సులోచన, నాగలక్ష్మికి చెరో 73 ఓట్లు వచ్చాయి. ఎన్నికల సిబ్బంది టాస్ వేసి సులోచన గెలిచినట్లు ప్రకటించారు.
సొంత గ్రామాల్లో నాయకులకు ప్రతికూల ఫలితాలు
కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులపైనే గెలిచిన రెబల్స్
కట్య్రాలలో అమ్మమ్మపై పోటీచేసి విజయం సాధించిన మనవరాలు
టాస్‌తో ఇద్దరు వార్డు మెంబర్ల గెలుపు
‘పట్టు’ నిలుపుకోలే..
బీఆర్‌ఎస్ పర్వతగిరి మండల అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేశ్వర్‌రావు సొంతూరు కల్లెడలో కాంగ్రెస్ బలపర్చిన తక్కెళ్లపల్లి శ్రీనివాస్ గెలిచారు. బీఆర్‌ఎస్ బలపర్చిన చిన్నపాక శ్రీనివాస్‌పై 150 ఓట్ల తేడాతో గెలిచారు. బీజేపీ మండల అధ్యక్షుడు చీమల భిక్షపతి సొంతూరు దౌలత్‌నగర్‌లో కాంగ్రెస్ బలపర్చిన స్వరూప గెలిచారు. బీఆర్‌ఎస్ రెండో స్థానంలో నిలవగా, బీజేపీ బలపర్చిన అభ్యర్థి మూడో స్థానానికి పరిమితమయ్యారు.
కాంగ్రెస్ వర్ధన్నపేట మండల అధ్యక్షుడు, సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఎద్దు సత్యనారాయణకు పరాభవం తప్పలేదు. ఇల్లందలో బీఆర్‌ఎస్ బలపర్చిన బేతి సాంబయ్య చేతిలో ఆయన ఓడిపోయారు.
ము


