హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజియన్‌లో కండక్టర్, డ్రైవర్ పోస్టులను అవుట్ సోర్సింగ్‌కింద తీసుకోవాలన్న నిర్ణయాన్ని ఏజెన్సీలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయా.. ఒక్కో ఉ ద్యోగానికి రేటు కడుతున్నా యా.. ఇందుకోసం దళారులను నియమించుకుని నిరుద్యోగులనుంచి బేరసారాలకు దిగుతున్నాయా... ఇందుకు సంస్థలోని కొందరు ఉద్యోగులు సహకారం అందిస్తున్నారా.. అంటే అవుననే సమాధానం వస్తోంది. ఏ డిపోలో ఏయే పోస్టులు ఎన్ని భర్తీ చేస్తున్నారో కనీసం నోటిఫికేషన్ విడుదల చేయకుండా ఇష్టానుసారంగా నియామకాలు చేపడుతున్న తీరు ఇందుకు నిదర్శనమన్న టాక్ వినిపిస్తోంది. పోస్టుల సంఖ్య బయటకు తెలిస్తే తమ ఆటలు సాగవని భావించిన అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు.. ముందస్తు ఆర్టీసీ అధికారులు, ఉద్యోగులను మేనేజ్ చేస్తున్నట్లు సంస్థ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
వివాదాస్పదంగా నియామకాలు..
వరంగల్ రీజియన్‌లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగని యామకాలు వివాదాస్పదం అవుతున్నాయి. రిటైర్ అయిన వారిస్థానంలో.. కొత్తగా అవసరం మేరకు ఉద్యోగ నియామకాలన్నీ అవుట్‌సోర్సింగ్ కింద తీసుకుంటున్నారు. ఆర్టీసీ వరంగల్ రీజినల్ కార్యాలయం కేంద్రంగా ఈ నియామకాలు సాగుతుంటాయి. ఈ కార్యాలయంలోని పర్సనల్ విభాగంలోని ఓ ఉద్యోగి అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ప్రతినిధులు వస్తే వారిని ‘అన్న’ అంటూ రాచమర్యాదలు చేస్తున్నాడనే ఆరోపణలున్నాయి. అద్దెబస్సు డ్రైవర్ల వివరాలు ‘ఉప్పులా’ అందిస్తున్నాడని ఆరోపణలున్నాయి. అదే విధంగా ఓ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ఏకంగా గతంలో అద్దె బస్సుపై డ్రైవర్‌గా పనిచేసిన వ్యక్తిని దళారీగా నియమించుకుని అద్దెబస్సు డ్రైవర్లకు గాలం వేస్తున్నాడని సమాచారం. రెగ్యులర్ నియామకాల్లో అవుట్ సోర్సింగ్ డ్రైవర్లకు ప్రాధాన్యత ఉంటుందని, తర్వాత పర్మనెంట్ చేయిస్తామని ఆశ చూపుతూ, వారినుంచి రూ.20 నుంచి 50 వేల వరకు వసూళ్లు చేస్తూ అవుట్ సోర్సింగ్ డ్రైవర్‌గా నియమిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ ఏజెన్సీకి ఆర్‌ఎం కార్యాలయం పర్సనల్ విభాగం ఉద్యోగి ఒకరు అద్దెబస్సు డ్రైవర్ల జాబితాను అందించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ జాబితాను ముందు పెట్టుకుని ఏజెన్సీ నిర్వాహకులు.. దళారీ ద్వారా అద్దెబస్సు డ్రైవర్లను పిలిపించుకుని వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు సహకరించిన ఉద్యోగులు, అధికారులకు మామూళ్లు సమర్పించుకుంటున్నారనే ఆరోపణలు ఆర్టీసీ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి
ఆధారాలతో ఫిర్యాదు చేస్తే చర్యలు..
ఆర్టీసీలో అవుట్ సోర్సింగ్ విధానంలో కండక్టర్, డ్రైవర్లను తీసుకుంటున్నాం. ఉద్యోగాల నియామకాల్లో అక్రమాలు జరిగినట్లు, అవినీతికి పాల్పడినట్లు, మామూళ్లు తీసుకున్నట్లు ఆధారాలతో ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం.
– డి.విజయభాను, ఆర్‌ఎం, వరంగల్
పలువురు అధికారుల సహకారం..
వరంగల్ రీజియన్‌లోని ఓ రెండు డిపోల్లో మంచిస్థాయిలో ఉన్న అధికారులు ఏజెన్సీలకు సంపూర్ణగా సహకరిస్తున్నారని విస్తృత ప్రచారం జరుగుతోంది. వీరి కనుసన్నల్లోనే అవుట్ సో ర్సింగ్ నియామకాలు జరుగుతున్నాయని తెలి సింది. హనుమకొండ జిల్లాలోని ఓ మున్సిపాలిటీ కేంద్రంలో ఉన్న డిపోతోపాటు, ఉద్యమ నేత పేరుతో ఉన్న జిల్లాలోని ఓ డిపోలో ఆర్టీసీ ఉద్యోగులు అవినీతి, అక్రమార్జనకు అలవాటు పడి నిరుద్యోగుల అవసరాలను అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా సొమ్ము చేసుకుంటున్నారని ఆ శాఖ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కండక్టర్ నియామకం కోసం రూ.20 వేల నుంచి 80 వేల వరకు, లేదా ముందుగా రూ.20 వేలు తీసు కోవడంతోపాటు నియామకమైన తర్వాత మూ డు నెలల జీతం ఏజెన్సీలు తీసుకుంటున్నాయని ప్రచారం ఉంది. యాజమాన్యం స్పందించి నియమకాలపై విచారణ జరిపించి వసూళ్లకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని నిరుద్యోగులు కోరుతున్నారు.
ఆర్టీసీలో అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల దందా
అవసరం మేరకు
కొత్తవారి నియామకం
అన్నీ అవుట్‌సోర్సింగ్
ఏజెన్సీల ద్వారా భర్తీ..
ఏజెన్సీలకు ‘సహకారం’ అందిస్తున్న సంస్థ ఉద్యోగులు!
వరంగల్ రీజినల్ కార్యాలయం
కేంద్రంగా అక్రమాలు?


