ధర్మసాగర్: వ్యవసాయ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతోందని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మండల కేంద్రంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో సోమవారం సబ్సిడీపై వ్యవసాయ పనిముట్ల పంపిణీ చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరై ధర్మసాగర్, వేలేరు మండలాల 12 మంది లబ్ధిదారులకు 50 శాతం సబ్సిడీపై రోటవేటర్లు, బేయిలర్స్, స్ప్రేయర్స్ వంటి వ్యవసాయ పనిముట్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా రైతులు యాంత్రిక పద్ధతులు పాటించాలని సూచించారు. హనుమకొండ జిల్లాలో ధర్మసాగర్, వేలేరు మండలాలు పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడిన మండలాలు అని, సబ్సిడీ యంత్రాల కేటాయింపులో ఈ రెండు మండలాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా వ్యవసాయ అధికారులను కోరారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రవీందర్ సింగ్, ఏడీఏ ఆదిరెడ్డి, ఏఓలు రాజేశ్, కవిత, తహసీల్దార్ సదానందం, ఎంపీడీఓ అనిల్ కుమార్, సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.


