
వైద్య విద్యార్థులకు ఆర్థిక చేయూత
హన్మకొండ: వైద్య విద్యలో ప్రవేశాలు పొంది ఫీజు చెల్లించే స్థోమత లేని విద్యార్థులకు దాతలు అండగా నిలిచారు. హనుమకొండ నక్కలగుట్టలోని హోటల్ హరిత కాకతీయలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో వైద్యవిద్యలో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు దాతలు ఆర్థికసాయం అందించారు. ఎంబీబీఎస్‌లో సీటు సాధించి ఫీజు చెల్లించలేని దీనస్థితిని నీట్ పేరెంట్ మల్లోజు సత్యనారాయణ చారి వీడియో రూపొందించి యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన దాతలు స్పందించి ఆర్థిక సాయాన్ని అందించారు. రవికుమార్ కొప్పకుల రూ.50 వేలు, కోర శ్రీనివాస్ రూ.25 వేలు, లక్క రాజేశ్వరి రూ.25 వేలు, ఇతరులు కలిసి మొత్తం రూ.2.50 లక్షలు విరాళంగా అందించారు. ఆమొతాన్ని ప్రతిమ వైద్య కళాశాలలో ప్రవేశం పొందిన తల్లితండ్రి లేని హనుమకొండ పెద్దమ్మగడ్డకు చెందిన ఆరుమల్లి గణేశ్‌కు రూ.60 వేలు, జగిత్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు సాధించిన నిజామాబాద్‌కు చెందిన నునావత్ దివ్యకు రూ.50 వేలు, ప్రతిమ మెడికల్ కళాశాలలో సీటు సాధించిన సిరిసిల్లకు చెందిన చెప్యాల గౌతమి రూ.50 వేలు, ప్రతిమ మెడికల్ కళాశాలలో ప్రవేశం పొందిన మహబూబ్‌నగర్‌కు చెందిన నానికి రూ.50 వేలు అందించారు. ఇందులో నీట్ పేరెంట్స్ రావుల మధు, లడే శ్రీనివాస్, మానస, రాచమల్ల రవీందర్, దుర్గ ప్రసాద్, రాచకొండ ప్రవీణ్ పాల్గొన్నారు.