
మానవత్వం లేని సీఎం రేవంత్‌రెడ్డి
పరకాల: ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి.. ప్రతిపక్షనేతగా కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ విమర్శించారు. ఎన్నికల ముందు పెన్షన్‌దారులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రేవంత్‌రెడ్డి విఫలమయ్యారని.. ఆయనలో మానవత్వం కనిపించట్లేదని మండిపడ్డారు. పరకాలలోని మయూరి గార్డెన్‌లో బుధవారం దివ్యాంగుల, చేయూత పింఛన్‌దారుల నియోజకవర్గ సన్నాహక సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంద కృష్ణ మాట్లాడుతూ.. దివ్యాంగులకు, చేయూత పెన్షన్‌దారులకు పింఛన్లు పెంచుతామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి మోసం చేశారన్నారు. పింఛన్ల పెంపుపై కనీసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. దివ్యాంగులకు రూ.6 వేలు, ఒంటరి మహిళలకు, పెన్షన్‌దారులకు రూ.4 వేలు మంజూరు చేయడంతో పాటు పెండింగ్‌లో ఉన్న 10 లక్షల పెన్షన్లను తక్షణమే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పోరాటాల్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు కందుకూరి సోమన్న, గద్దల సుకుమార్, కట్ల రాజశేఖర్, అంకిల్ల రాజు, శనిగరపు రవీందర్, సుంచు రజనీ తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగుల సన్నాహక సభలో
మంద కృష్ణమాదిగ