
ఎంజీఎంలో రోజురోజుకూ పెరుగుతున్న కేసులు
ఎంజీఎం: విషజ్వరాలతో చిన్నారులు విలవిల్లాడుతున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలో పిల్లల ప్రభుత్వ ఆస్పత్రి లేకపోవడంతో జనగామ, హనుమకొండ, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, సిద్దిపేట, కరీంనగర్, హుజూరాబాద్ వంటి ప్రాంతాల నుంచి చిన్నారులను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తీసుకొస్తున్నారు. కొన్నేళ్ల క్రితం ఇక్కడ అన్ని విభాగాల కంటే పిడియాట్రిక్ విభాగం పనితీరు భేష్‌గా ఉండేదని చెప్పేవారు. కాగా, ప్రస్తుతం ఈ విభాగం పనితీరు అధ్వానంగా మారుతోంది. విషజ్వరాలు, డెంగీ తదితర వ్యాధులపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన వైద్యాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో చిన్నారులు అరకొర వసతుల నడుమ చికిత్స పొందుతున్నారు.
120 మందికి డెంగీ..
సీజన్ వ్యాధుల్లో భాగంగా చిన్నారులపై విషజ్వరాలు, డెంగీ పంజా విసురుతున్నాయి. ఈనాలుగు నెలల కాలంలో 500 మంది చిన్నారులు విషజ్వరాలతో ఎంజీఎంలో చికిత్స పొందారు. 120 మందికిపైగా డెంగీతో చికిత్స పొందుతున్నారు. అలాగే, 30కి పైగా మలేరియా కేసులు నమోదయ్యాయి. వీటన్నింటికీ తోడు శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతూ ఎంజీఎం ఆస్పత్రికి వచ్చే చిన్నారుల సంఖ్య పెరుగుతోంది.
ప్రైవేట్‌కు పరుగులు
ఎంజీఎం ఆస్పత్రిలో రక్త పరీక్షలకు రీ ఏజెంట్స్ కొరత రోగులకు పెద్ద తలనొప్పిగా మారింది. సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి సమయానికి రీ ఏజెంట్స్ రాకపోవడం.. కాంట్రాక్టర్ల నుంచి కొనుగోలు చేద్దామంటే బిల్లుల చెల్లింపులు లేకపోవడం పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో కాంట్రాక్టర్లు సరఫరా చేయక చేతులెత్తేయడంతో పలు రక్త పరీక్షలకు రో గులు ప్రైవేట్‌కు పరుగులు తీయక తప్పడం లేదు.
ప్రొఫెసర్ల గైర్హాజరు
పిల్లల విభాగంలో పలువురు ప్రొఫెసర్లతోపాటు అసోసియేట్ వైద్యులు సైతం హైదరాబాద్ నుంచి వరంగల్‌కు రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో పిల్ల ల విభాగంపై వైద్యాధికారులు పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారు. వారంలో రెండు రోజులకోసారి విధులకు వచ్చే వైద్యులు ఇక్కడ నాలుగు గంటలు సైతం విధులు నిర్వర్తించకపోవడం పరిపాటిగా మారింది. పీజీ వైద్యులే సేవలందిస్తున్నారు. ఇప్పటికై నా రాష్ట్ర, జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించి ఆస్పత్రిలో పలు విభాగాల వైద్యసేవలు మెరుగుపర్చాలని రోగులు కోరుతున్నారు.
రద్దీకి తగినట్లుగా సౌకర్యాలు
కల్పించాలని పిల్లల తల్లిదండ్రుల మొర
వైద్యాధికారుల గైర్హాజరు..
క్షీణిస్తున్న వైద్యసేవలు
రీ ఏజెంట్స్ కొరత.. రక్త పరీక్షల కోసం ప్రైవేట్‌కు పరుగులు

ఎంజీఎంలో రోజురోజుకూ పెరుగుతున్న కేసులు