
ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలి
హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో వానాకాలం (ఖరీఫ్ సీజన్) 2025–26లో ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులు, రైస్ మిల్లర్లు, ప్యాడీ కాంట్రాక్టర్లతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా స్నేహశబరీష్ మాట్లాడుతూ.. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ మొదటి వారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. టార్పాలిన్లు, వెయింగ్ మిషన్లు, మాయిశ్చర్ మిషన్లు, టెంట్, వాటర్, తదితర ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు.
ధాన్యం సేకరణకు పకడ్బందీ ఏర్పాట్లు
న్యూశాయంపేట: ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ సంధ్యారాణి అధికారులను ఆదేశించారు. బుధవారం వరంగల్ కలెక్టరేట్ సమావేశ హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను అక్టోబర్ మొదటి వారంలో ప్రారంభించాలన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను సజావుగా సాగేలా చూడాలన్నారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.
హనుమకొండ కలెక్టర్
స్నేహ శబరీష్