
కూష్మాండ దుర్గ అలంకరణలో ఐనవోలు భ్రమరాంబిక
ఐనవోలు: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు గురువారం మండల కేంద్రంలోని శ్రీమల్లికార్జునస్వామి ఆలయంలో భ్రమరాంబిక అమ్మవారు కూష్మాండ దుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈసందర్భంగా ఆలయంలో నిత్యాహ్నికం, శ్రీ సూక్త విధానంతో షోడశోపచార పూజ, శ్రీలలిత సహస్రనామ, దేవి ఉపనిషత్ పారాయణాలు, మహానివేదన, నీరాజన మంత్రపుష్పం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఉపప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్ మాట్లాడుతూ.. అమ్మవారిని కూష్మాండ దుర్గగా, అష్టభుజి దేవిగా, నాలుగో అవతారంగా కొలుస్తారని తెలిపారు. ఎంతో విశిష్టత కలిగిన నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. ముఖ్య అర్చకులు పాతర్లపాటి శ్రీనివాస్, ఐనవోలు మధుకర్ శర్మ, వేద పారాయణదారులు గట్టు పురుషోత్తమశర్మ, విక్రాంత్ వినాయక్ జోషి, అర్చకులు నందనం భానుప్రసాద్, మధుశర్మ, శ్రీనివాస్, నరేశ్‌శర్మ, దేవేందర్, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.