బంతిపూల సాగులో భేష్‌ | - | Sakshi
Sakshi News home page

బంతిపూల సాగులో భేష్‌

Sep 26 2025 6:06 AM | Updated on Sep 26 2025 6:06 AM

బంతిప

బంతిపూల సాగులో భేష్‌

బంతిపూల సాగులో భేష్‌

ఐనవోలు: మండలంలో బంతిపూల సాగు ఏటేటా పెరుగుతోంది. ప్రత్యామ్నాయ పంటల వైపు ఆసక్తి చూపుతున్న రైతులు.. బంతిపూల సాగును కూడా తమ ప్రాధాన్యతల్లో చేర్చుకుంటున్నారు. ఒకప్పుడు పెరుమాండ్లగూడెంలో ఇద్దరు ముగ్గురు రైతులతో ప్రారంభమైన బంతిపూల సాగు మండలంలోని పెరుమాండ్లగూడెం, పంథిని, కక్కిరాలపల్లి, వెంకటాపురం, ఒంటిమామిడిపల్లి, పున్నేలు, నందనం తదితర గ్రామాలకు విస్తరించింది. సుమారు 80 మంది రైతులు దాదాపుగా 45 ఎకరాల్లో సాగు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, బంతిపూల సాగు జిల్లాలోని హనుమకొండ డివిజన్‌లో ఐనవోలు మండలం టాప్‌గా నిలుస్తోంది. హనుమకొండ డివిజన్‌ పరిధిలో సాగయ్యే దాంట్లో సుమారు 50 శాతం ఐనవోలులోనే బంతిపూల తోటలు సాగవుతున్నాయని హార్టికల్చర్‌ అధికారి తెలిపారు.

సాగు ఇలా..

సాధారణంగా వినాయక చవితి, బతుకమ్మ, దసరా, దీపావళి వేడుకల్లో బంతిపూలు విరివిగా వాడుతుంటారు. ఆయా పండుగలే టార్గెట్‌గా రైతులు బంతి సాగు చేపడుతున్నారు. సాగు చేయాలనుకుంటున్న రైతులు పండుగలకు ముందు సరిగ్గా మూడు నెలల క్రితం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న మేలు రకం బంతి విత్తనాలు కొని నారు పోసుకుంటున్నారు. అనంతరం నెల రోజుల్లోపు దుక్కి దున్ని డ్రిప్‌ ఏర్పాటు చేసుకుని మొక్కలు నాటుతున్నారు. రెండు నెలల్లో బంతిపూలు తెంపడానికి అనువుగా వస్తాయని రైతులు చెబుతున్నారు. ఎకరం సాగుకు విత్తనాల ఖరీదు సుమారు రూ.20 వేల వరకు ఉండగా, దుక్కి చేయడం, చీడపీడల నివారణ తదితరాలకు మరో రూ.20 వేల వరకు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు బంతిపూల దిగుబడిని బట్టి తెంపడానికి కూలీలు, మార్కెట్‌ తరలింపు ఖర్చులు అదనంగా ఉంటాయని రైతులు తెలిపారు.

తగ్గుతున్న దిగుబడులు

గతంలో మాదిరి కాకుండా ఈసారి బంతి పూల దిగుబడులు వాతావరణం అనుకూలించకపోవడంతో ఘణనీయంగా తగ్గే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకూలిస్తే 80 నుంచి 100 క్వింటాళ్ల వరకు ఎకరంలో పూల దిగుబడి సాధించవచ్చని.. కానీ ప్రస్తుత పరిస్ధితిలో సగానికి సగం దిగుబడి తగ్గిపోతుందని రైతులు చెబుతున్నారు. వాతావరణం అనుకూలించక వైరస్‌ ఇతరత్రా సమస్యలతో బంతి మొక్క శాఖలుగా విస్తరించకుండా చాలా తక్కువగా పూలు పూస్తున్నాయి. గతంలో చీడపీడల నివారణకు రెండు సార్లు మాత్రమే మందులు పిచికారీ చేయగా ఇప్పటి వరకు సుమారు 6–8 సార్లు పురుగు మందులు పిచికారీ చేసినట్లు రైతులు చెబుతున్నారు. ఎంగిలి పూల బతుకమ్మ రోజు తొలిసారిగా బంతిపూలను కోసి మార్కెట్‌లో రైతులు అమ్ముకోగా, సద్దుల బతుకమ్మ, దసరా, దీపావళి పండుగల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికే దిగుబడులు తగ్గాయని రైతులు చెబుతుండగా.. దానికి తోడు మండలంలోని ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా పూల క్వాలిటీ తగ్గిపోయే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. దిగుబడులు తగ్గినా రేటు పెరిగితే రైతులకు కలిసివచ్చే అవకాశం ఉంది.

ధర ఉంటేనే కలిసోచ్చేది..

గతేడాది 18 గుంటల్లో బంతిసాగు చేశా. 40 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఖర్చులన్నీ పోను రూ. 80వేలు లాభం వచ్చింది. ఈసారి గతంతో పోలిస్తే 50 శాతం పూల దిగుబడి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 8 సార్లు మందులు పిచికారీ చేశా. అకాల వర్షాల వల్ల ఇబ్బంది పడుతున్నాం. దిగుబడి తగ్గినా ధర ఉంటే మేలవుతుంది. నాలుగేళ్లుగా సాగు చేస్తున్నా.. పత్తిపంట కంటే పూల సాగే బాగుంది.

– బొల్లెబోయిన శ్రీనివాస్‌, రైతు,

పెరుమాండ్లగూడెం

రైతులను ప్రోత్సహిస్తున్నాం..

సంప్రదాయ పత్తి, మొక్కజొన్న, వరి పంటలే కాకుండా పామాయిల్‌, పూలతోటలు, పందిరి కూరగాయలు, అరటి, మామిడి, బొప్పాయి, పసుపు తదితర పంటల వైపు రైతులు దృష్టిసారించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈ ఆర్థిక సంవత్సరంలో బంతిపూలు సాగు చేసే రైతులకు ఎకరాకు రూ.8 వేలు గరిష్టంగా రూ.20 వేలు సబ్సిడీ ప్రోత్సాహకం ఉద్యానవన శాఖ ద్వారా అందిస్తున్నాం. – సుస్మిత, ఉద్యాన అధికారి,

హనుమకొండ డివిజన్‌

ఐనవోలు మండలంలో

పెరుగుతున్న బంతి సాగు

అకాల వర్షం, వైరస్‌లతో

తగ్గనున్న దిగుబడి

ప్రోత్సాహకం అందిస్తున్న ఉద్యాన శాఖ

బంతిపూల సాగులో భేష్‌1
1/2

బంతిపూల సాగులో భేష్‌

బంతిపూల సాగులో భేష్‌2
2/2

బంతిపూల సాగులో భేష్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement