
అధ్యాపకుల చేతుల్లోనే విద్యార్థినుల భవిష్యత్
● ఇంటర్మీడియెట్ అబ్జర్వర్ వసుంధరాదేవి
హన్మకొండ: అధ్యాపకుల చేతుల్లోనే విద్యార్థినుల భవిష్యత్ ఆధారపడి ఉంటుందని ఇంటర్మీడియెట్ బోర్డు అబ్జర్వర్ వసుంధరాదేవి అన్నారు. హనుమకొండ వడ్డేపల్లిలోని ప్రభుత్వ పింగిళి బాలికల జూనియర్ కళాశాలను గురువారం ఆమె సందర్శించారు. కళాశాలో అడ్మిషన్లు, అధ్యాపకుల వివరాలు, విద్యా బోధన అంశాలపై సమీక్షించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కళాశాలలో 1,000 అడ్మిషన్లు కావడం అభినందనీయమని పేర్కొన్నారు. అడ్మిషన్లతోపాటు విద్యార్థినుల ఎఫ్‌ఆర్‌ఎస్ కూడా పూర్తిచేయాలని, పేరెంట్స్ టీచర్స్ సమావేశాన్ని సజావుగా నిర్వహించాలని సూచించారు. కళాశాలలో మౌలిక వసతుల కల్పనకు ఇంటర్ బోర్డు కమిషనర్ నిధులు విడుదల చేశారని వివరించారు. సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ పి.కవిత, అధ్యాపకులు పాల్గొన్నారు.
హన్మకొండ: హనుమకొండ జిల్లాలో గురువారం ఆకాశం మేఘావృతమై ముసురేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రోజంతా ముసురు, కొన్ని చోట్ల మోస్తరు వర్షం కురిసింది. ఆటోమేటిక్ వెదర్ స్టేషన్‌లో రాత్రి 8 గంటల వరకు కురిసిన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ విడుదల చేసింది. కమలాపూర్‌లో 40 మిల్లీమీటర్లు, దామెరలో 35.8, కాజీపేటలో 31, ఎల్కతుర్తిలో 29.5, ధర్మసాగర్‌లో 29, ఆత్మకూరులో 28.5, కమలాపూర్ మండలం మరిపల్లిగూడెంలో 27.3, మడికొండలో 26, ఐనవోలులో 22.5, హసన్‌పర్తి మండల చింతగట్టులో 21.5, నాగారంలో 20.8, నడికూడలో 18.8, కొండపర్తిలో 18, పెద్దపెండ్యాలలో 14.5, శాయంపేటలో 13.3, పరకాలలో 10.8, దామెర మండలం పులుకుర్తిలో 5.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.