
సమష్టి కృషితోనే దినదినాభివృద్ధి
ఎల్కతుర్తి : మహిళా సభ్యుల సమష్టి కృషితోనే మహిళా డెయిరీ దినదినాభివృద్ధి చెందుతోందని ముల్కనూరు సహకార సంఘం అధ్యక్షుడు అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూరు సహకార డెయిరీ 23వ వార్షిక మహాసభను సీనియర్ డైరెక్టర్ మామిడాల శోభారాణి అధ్యక్షతన సోమవారం డెయిరీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వార్షిక మహాసభలో డెయిరీ లావాదేవీలు చదివి వినిపించారు. ముఖ్య అతిథిగా హాజరైన సొసైటీ అధ్యక్షుడు ప్రవీణ్‌రెడ్డి మాట్లాడుతూ.. 203 పాల ఉత్పత్తి సంఘాలతో ప్రారంభమై 23,045మంది సభ్యుల సహకారంతో ప్రతీ ఏటా రూ.2కోట్ల లీటర్లకు పైగా పాలు సేకరిస్తూ, రూ.180కోట్ల వ్యాపారం చేసే స్థాయికి ఎదగడం అభినందనీయమన్నారు. డెయిరీ జీఎం భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.15.47కోట్ల బోనస్‌ను సభ్యులకు అందజేస్తున్నట్లు వెల్లడించారు. గేదె, ఆవుపాల విభాగంలో ముల్కనూరుకు చెందిన అలుగు రజిత రూ.6,82,590, సిర్సపల్లికి చెందిన గుజ్జ అరుణ రూ.22,40,947 పాల బిల్లు పొంది అగ్రస్థానంలో నిలిచినందుకు వారిని శాలువాతో సన్మానించారు. ఉత్తమ పాల ఉత్పత్తి సంఘాలు.. వంగర (పాల పరిమాణం), భీమదేవరపల్లి (సహకార పద్ధతులు), ముత్తారం తండా (లావాదేవీలు), ఉల్లంపల్లి (పాడి పశువుల నిర్వహణ), ఇందిరానగర్ (ఆర్థిక లావాదేవీలు) అంశాలను పరిగణనలోకి తీసుకొని వారికి జ్ఞాపికలు అందజేశారు. సమావేశంలో మహిళా సభ్యులు, పాడి మహిళా రైతులు, డెయిరీ ఉద్యోగులు పాల్గొన్నారు.
ముల్కనూరు సహకార సంఘం
అధ్యక్షుడు ప్రవీణ్‌రెడ్డి
డెయిరీ సభ్యులకు
రూ.15.47కోట్ల బోనస్
ఘనంగా మహిళా సహకార డెయిరీ 23వ వార్షికోత్సవం

సమష్టి కృషితోనే దినదినాభివృద్ధి