
గ్రామ సింహాలతో గజగజ!
కమలాపూర్: కమలాపూర్ మండలం వ్యాప్తంగా వీధి కుక్కలు, పిచ్చి కుక్కల బెడద రోజురోజుకూ తీవ్రమవుతోంది. కమలాపూర్‌లో ఇటీవల ఒక్క రోజే ఓ పిచ్చి కుక్క దాడి చేసి ఏకంగా 21 మందిని కరిచి గాయపర్చింది. దీంతో కమలాపూర్‌తోపాటు మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. కుక్కల బారి నుంచి తమను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
నెలన్నర వ్యవధిలో 120 మందిపై..
కమలాపూర్ మండల వ్యాప్తంగా గడిచిన నెలన్నర (జూన్ 1 నుంచి జూలై 15 వరకు) వ్యవధిలో కుక్కలు కమలాపూర్‌లో 35 మంది, మర్రిపల్లిగూడెంలో 10 మంది, అంబాల, గుండేడు గ్రామాల్లో 9 మంది, గూడూరులో 8 మంది, శంభునిపల్లిలో ఆరుగురు, శనిగరంలో ఐదుగురు ఇలా.. మండలవ్యాప్తంగా మరికొన్ని గ్రామాల్లో కలిపి మొత్తం 120 మందిపై దాడి చేసి గాయపర్చాయి. ఈనెల 15న కమలాపూర్‌లో పిచ్చికుక్క దాడిలో ఒక్కరోజే 21 మందికి గాయాలయ్యాయంటే కుక్కలు ఏ రకంగా స్వైర విహారం చేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు.
పాదచారులు, వాహనదారుల
వెంట పడుతున్న కుక్కలు..
కమలాపూర్, గూడూరు, అంబాల, మర్రిపల్లిగూడెం, శనిగరం, కానిపర్తి, శంభునిపల్లి తదితర గ్రామాల్లో వీధి కుక్కల బెడద విపరీతంగా పెరిగిపోయింది. ఎంతగా అంటే గుంపులు గుంపులుగా రోడ్లపైకి చేరి పాదచారులు, వాహనదారులపై దాడికి దిగుతున్నాయి. వాహనదారులను వెంబడిస్తూ ప్రమాదాల బారిన పడేలా చేస్తున్నాయి. ఇలా పలువురు వాహనదారులు తీవ్ర గాయాలపాలయ్యారు.
సైకిల్ మీద పోతాంటె కరిచింది
నేను కూలి పని చేసుకుని బతుకుతున్నా. తాపీ పని చేయడానికి సైకిల్ మీద పోతాంటే చిన్న బడి దగ్గర పిచ్చి కుక్క నా మీద పడి కరిచింది. పిచ్చి కుక్క దాడిలో నా ఎడమ మోచేతికి తీవ్ర గాయమైంది. మూడు రోజులు దావఖాన్ల ఉండి చికిత్స చేయించుకొని ఇంటికి వచ్చిన. కుక్క కరిచినప్పటి నుంచి పనికి పోవుడు బందైంది.
– మాట్ల శ్రీనివాస్, కమలాపూర్
పాల ప్యాకెట్ తెత్తాంటె కరిచింది..
నేను కమలాపూర్‌లోని బీసీ కాలనీలో డబుల్ బెడ్రూం దగ్గర ఉంటున్న. దుకాండ్లకు పోయి పాల ప్యాకెట్ తెత్తాంటె పిచ్చి కుక్క ఎగబడి కరిసింది. నా కుడి చేతికి తీవ్ర గాయమైంది. దావఖాండ్లకు పోతె మూడు రోజులు ఉంచుకొని చికిత్సలు చేసి ఇంటికి పంపించిండ్లు. ఇంకా చేతి నొప్పి, గాయం తగ్గలేదు.
– కనుకుంట్ల ప్రమీల, కమలాపూర్
పిచ్చికుక్కల స్వైర విహారం
కమలాపూర్‌లో ఒక్కరోజే
21 మందిపై దాడి
నెలన్నర వ్యవధిలో 120 మందికి
గాయాలు
తీవ్ర భయాందోళనలో
మండల ప్రజలు
కుక్కల బారినుంచి
కాపాడాలని వేడుకోలు

గ్రామ సింహాలతో గజగజ!

గ్రామ సింహాలతో గజగజ!

గ్రామ సింహాలతో గజగజ!