
కడియం కావ్య
సాక్షి ప్రతినిధి వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. వరంగల్ లోక్ సభ బీఆర్‌ఎస్ అభ్యర్థి కడియం కావ్య తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు గురువారం రాత్రి అధికారికంగా ప్రకటించారు. ఇటీవలి కాలంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులపై వస్తున్న అవినీతి ఆరోపణలు, భూకబ్జాలతో పాటు లిక్కర్ కుంభకోణంలో కవిత పాత్ర, ఫోన్ ట్యాపింగ్ తదితర వ్యవహారాల్లో బీఆర్‌ఎస్ ముఖ్య నాయకుల, అధినేత పాత్రతో తాను ఆందోళన చెంది పోటీ నుంచి విరమించుకుంటున్నట్లు తెలిపారు. తనకు వరంగల్ పార్లమెంట్ స్థానంలో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చిన కేసీఆర్‌కు ఆమె ధన్యవాదాలు తెలిపా రు. కాగా.. కడియం కావ్య కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయవచ్చని అంతా భావిస్తున్నారు. కడియం కావ్య లేదా కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీగా పోటీ చేయవచ్చని భావిస్తున్నారు. ఒకవేళ కావ్య కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేస్తే శ్రీహరిని రాష్ట్ర ప్రభుత్వంలో కేబినెట్‌లోకి తీసుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. మొత్తానికి రాష్ట్ర రాజకీయాల్లో ఈ పరిణామం పెను సంచలనంగా మారింది.
పోటీ నుంచి తప్పుకున్న కడియం కావ్య