అలంపూర్: జోగుళాంబదేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆహ్వానించినట్లు అలంపూర్ క్షేత్ర ఆలయాల ఈఓ దీప్తి తెలిపారు. హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ హన్మంతురావు, ఈఓ దీప్తి, గద్వాల సంస్థాన వారసులు కృష్ణ రాంభూపాల్ శుక్రవారం కలిశారు. ఆదివారం నుంచి జోగుళాంబదేవి, బాలబ్రహ్మేశ్వరస్వామి దేవస్థానంలో జరిగే దసరా ఉత్సవాలకు సీఎంను ఆహ్వానించినట్లు చెప్పారు. అలాగే జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామివారి జ్ఞాపికను సీఎంకు అందజేశారు.
ధాన్యం కొనుగోళ్లలో నిబంధనలు పాటించాలి
వీపనగండ్ల: వరి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని సేకరించే సమయంలో ప్రభుత్వ నిబంధనలు విధిగా పాటించాలని వ్యవసాయశాఖ ఏడీ తిప్పస్వామి ఆదేశించారు. శుక్రవారం మండలంలోని గోపల్‌దిన్నెలో చిన్నంబావి, వీపనగండ్ల మండలాల కొనుగోలు కేంద్రాల సిబ్బంది, వీఓఏల శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరై పలు సూచనలు చేశారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా తగిన వసతులు కల్పించడంతో పాటు నాణ్యమైన ధాన్యాన్ని సేకరించాలని, రైతులకు డబ్బులను సకాలంలో చెల్లించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి డాకేశ్వర్‌గౌడ్, ఏపీఎం మద్దిలేటి పాల్గొన్నారు.
స్వచ్ఛత, నాణ్యత
తప్పనిసరి
అమరచింత: హోటల్ నిర్వాహకులు నాణ్యతతో పాటు పరిశుభ్రతను పాటించాలని ఇన్‌చార్జ్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ కరుణాకర్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని పలు హోటళ్లు, టిఫిన్ సెంటర్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అదేవిధంగా పాలు, కోడిగుడ్ల విక్రయ కేంద్రాలను సైతం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పట్టణంలోని హోటల్, టిఫిన్ సెంటర్ల నిర్వాహకులు నాణ్యత పాటించడం లేదని, శుభ్రతను విస్మరిస్తున్నారనే ఫిర్యాదులు రావడంతో తనిఖీలు చేపట్టామన్నారు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయనే విషయాలను గుర్తించి సదరు యాజమానులకు నోటీసులు జారీ చేశామని తెలిపారు.
సస్యరక్షణతోనే
తెగుళ్ల నివారణ
అమరచింత: సస్యరక్షణ చర్యలతోనే తెగుళ్లను నివారించవచ్చని మదనాపురం కేవీకే శాస్త్రవేత్త డా. భవాని సూచించారు. శుక్రవారం మండలంలోని చింతరెడ్డిపల్లిలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పొలంబడి కార్యక్రమానికి ఆమె హాజరై పంట నేల తయారీ, విత్తనం ఎంపిక నుంచి కోత, విక్రయం వరకు తీసుకుంటున్న చర్యలను రైతులను అడిగి తెలుసుకున్నారు. సలహాలు, సూచనల కోసం కేవీకే కేంద్రాన్ని సంప్రదించాలన్నారు. ఏఓ అరవింద్, గ్రామ సర్పంచ్ పాల్గొన్నారు.


