వనపర్తి రూరల్: హాస్టల్ విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. పెబ్బేరు మహిళా పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఉన్న బీసీ సంక్షేమ బాలికల హాస్టల్‌లో గురువారం పలువురు విద్యార్థినులు అనారోగ్యంతో ఆస్పత్రి పాలైన విషయం పాఠకులకు విధితమే. శుక్రవారం ఉదయం కలెక్టర్ హాస్టల్‌ను సందర్శించి విద్యార్థినులతో మాట్లాడి భోజనం నాణ్యత, తాగునీరు, అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు అస్వస్థతకు గురికావడానికి గల కారణాలను సంబంధిత అధికారులు, విద్యార్థులతో ఆరా తీశారు. మొత్తం 22 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని.. ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించినట్లు బీసీ సంక్షేమ అధికారి వివరించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. రోజు ఆహారాన్ని తనిఖీ చేసిన తర్వాతే విద్యార్థులకు అందించాలని ప్రిన్సిపాల్‌కు, హాస్టల్ నిర్వాహకులకు సూచించారు. వంట మనుషులను మార్చాలని బీసీ వెల్ఫేర్ అధికారిని ఆదేశించారు. ఘటనకు బాధ్యులైన వారిపై విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.


