వనపర్తి: జిల్లాలో నేరాల నియంత్రణ, కేసుల దర్యాప్తు, పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ డి.సునీతరెడ్డి ఆదేశించారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన నేర సమీక్షలో ఆమె పాల్గొని పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతి ఎఫ్‌ఐఆర్‌ను ఈ–సాక్ష్య విధానంలో నమోదు చేసి, ఆధారాలను నిబంధనల ప్రకారం సేకరించాలని సూచించారు. బీఎన్‌ఎస్ నిబంధనల ప్రకారం 60, 90 రోజుల గడువుతో కూడిన కేసుల దర్యాప్తును నిర్ణీత సమయంలో పూర్తి చేయాలన్నారు. ఆన్‌లైనన్, జీరో ఎఫ్‌ఐఆర్‌లపై తక్షణ చర్యలు తీసుకోవాలని, సీసీ కెమెరాల పర్యవేక్షణ సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు టీజీ కాప్, హెచ్‌ఆర్‌ఎంఎస్, సీఈఐఆర్ పోర్టల్స్‌లోని సమాచారాన్ని ఎప్పటికప్పుడు నవీకరించాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కేసులను వేగంగా పరిష్కరించాలని, డయల్ 112కు అందే అత్యవసర ఫిర్యాదులపై తక్షణమే స్పందించి బాధితులకు సకాలంలో సాయం అందించాలని కోరారు. ఈ–పెట్టీ, ఐటీ యాక్ట్, దర్యాప్తులో ఉన్న కేసులు, పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. చార్జ్‌షీట్ల దాఖలు శాతాన్ని పెంచడంతో పాటు సమన్లు, వారెంట్ల అమలును వేగవంతం చేయాలని, ప్రజలకు న్యాయం అందించడమే లక్ష్యంగా ప్రతి పోలీసు అధికారి బాధ్యగా, పారదర్శకంగా విధులు నిర్వర్తించాలని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటూ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ వీరారెడ్డి, డీఎస్పీ గిరిబాబు, డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్‌తో పాటు జిల్లాలోని సీఐలు, ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.


