ఉచిత సేవలు వినియోగించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఉచిత సేవలు వినియోగించుకోవాలి

Oct 10 2026 12:46 AM | Updated on Oct 10 2026 12:46 AM

నారాయణపేట: మానసిక అనారోగ్యం, మేధో వైకల్యంతో బాధపడుతున్న వారికి న్యాయపరమైన రక్షణతో పాటు మెరుగైన వైద్యసేవలు, సంక్షేమ పథకాలు అందేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వింధ్యానాయక్‌ సూచించారు. శుక్రవారం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో నల్సా (మానసిక అనారోగ్యం, మేధో వైకల్యం ఉన్న వ్యక్తులకు న్యాయసేవలు) పథకం–2024పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నవారు అవగాహన లోపం, సామాజిక వివక్ష కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. వారికి న్యాయం, వైద్యం, సామాజిక భద్రత అందించడమే నల్సా పథకం ప్రధాన ఉద్దేశమన్నారు. బాధితులు వివక్షకు గురికాకుండా గౌరవప్రదమైన జీవనం అందించాల్సిన బాధ్యత సమాజంపై ఉందని పేర్కొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బాధితులకు ఉచిత న్యాయసాయం, దివ్యాంగ ధ్రువీకరణ పత్రాలు, యూడీఐడీ కార్డులు, పింఛన్లు, ఇతర సంక్షేమ ప్రయోజనాలు పొందేందుకు సహకరిస్తామని చెప్పారు. వైద్య, ఆరోగ్య, సంక్షేమ శాఖల అధికారులు, పారా లీగల్‌ వలంటీర్లు, ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి అవసరమైన వారికి సకాలంలో సాయం అందించాలని కోరారు. పోలీసు, వైద్య, సంక్షేమ శాఖలు బాధితుల పట్ల సున్నితంగా వ్యవహరించాలని సూచించారు. న్యాయసాయం అవసరమైనవారు టోల్‌ఫ్రీ నంబర్‌ 15100, లేదా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయం, రెండో అంతస్తు, న్యాయ సేవాసదనం, జిల్లా కోర్టు, నారాయణపేటలో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ కె.లక్ష్మీపతి, డీఎంహెచ్‌వో డా. జయచంద్రమోహన్‌, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డా. ఆదిత్య, పోలీసు అధికారి బాలయ్య, అజహ్రా ఫాతిమా, వైద్యులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement