‘చేయూత’ సేవలు అభినందనీయం
వనపర్తి రూరల్: అనాథలను చేరదీసి వారి బాగోగులు చూసుకుంటున్న చేయూత ఆశ్రమ నిర్వాహకుల సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కొనియాడారు. ఆదివారం మండలంలోని చిట్యాల సమీపంలోని చేయూత అనాథ ఆశ్రమానికి తన తల్లిదండ్రులు సాయిరెడ్డి, వెంకటమ్మ జ్ఞాపకార్థం రూ.6 లక్షల విలువైన ఆటోను ఎమ్మెల్యే ఆశ్రమ నిర్వాహకుడు శ్రీనివాస్‌రెడ్డికి అందజేశారు. అలాగే 2004లో అనాథగా ఆశ్రమంలో చేరిన మాధవి వివాహం చిన్నంబావి మండలం గోపాలాపురం గ్రామానికి చెందిన సందీప్‌రెడ్డితో ఆశ్రమంలో జరగగా పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించారు. వివాహం జరిపిస్తున్న ఆశ్రమ నిర్వాహకులు శ్రీనివాస్‌రెడ్డి దంపతులను ఎమ్మేల్యే అభినందించారు. ఆశ్రమ నిర్వాహకుడు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఆశ్రమానికి వాహనం అందించి గొప్ప మనసు చాటుకున్నారని తెలిపారు. ఆశ్రమం నుంచి గ్రామాల్లోని అనాథ వృద్ధులకు భోజనాన్ని అందించేందుకు వాహనాన్ని వినియోగిస్తామని చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, మైనార్టీ నాయకులు రహీం, సూర్యచంద్రారెడ్డి, వెంకట్‌రెడ్డి, ఆర్యభవన్ శ్రీనివాస్, ఆదిత్య, చీర్ల విజయ్‌చందర్, లక్కాకుల సతీష్, చంద్రాయుడు సాగర్ పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి పరామర్శ..
గోపాల్‌పేట: ఏదుల మండలం చీర్కపల్లికి చెందిన గడ్డికోపుల నారమ్మ శనివారం రాత్రి మృతిచెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆదివారం గ్రామానికి చేరుకొని బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థికసాయం అందించారు. ఆయన వెంట ఉమ్మడి మండల ఇన్‌చార్జ్ సత్యశిలారెడ్డి, రేవల్లి మండల అధ్యక్షుడు పర్వతాలు, జమ్మి మల్లేష్, సురేష్‌గౌడ్, పరశురాం, రవి, రాజేష్, శేషయ్య తదితరులు ఉన్నారు.


