ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించండి
వనపర్తి: ప్రజావాణి ఫిర్యాదులు పెండింగ్‌లో లేకుండా వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి, స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఖీమ్యనాయక్, యాదయ్య, ఆర్డీఓ సుబ్రహ్మణ్యంతో కలిసి వారు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్, ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లా ప్రజావాణితో సహా సీఎం ప్రజావాణికి అందే ఫిర్యాదులతో పాటు ఇన్‌చార్జి మంత్రి నుంచి వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. దరఖాస్తుల పరిష్కారానికి తీసుకున్న చర్యలపై ఫిర్యాదుదారులకు తగిన సమాచారం అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజావాణికి 31 ఫిర్యాదులు అందినట్లు కలెక్టరేట్ సిబ్బంది తెలిపారు.


