చట్టాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు
ఖిల్లాఘనపురం: ప్రతి ఒక్కరూ చట్టాలకు లోబడి వ్యవహరించాలని.. ఎవరైనా చట్టాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్‌జడ్జి వి.రజని అన్నారు. సోమవారం ఖిల్లాఘనపురం మండలం దొంతికుంట తండా సమీపంలోని తెలంగాణ మోడల్ స్కూల్‌తో పాటు ఖిల్లాఘనపురం ఎస్టీ ఆశ్రమ, మామిడిమాడ పాఠశాలల్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యార్థుల కోసం కొన్ని చట్టాలను తీసుకురావడం జరిగిందన్నారు. ఆర్టికల్–21ఏ ప్రకారం 6 నుంచి 14 ఏళ్ల బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్య అందిస్తున్నట్లు చెప్పారు. ఎవరైనా బడిఈడు పిల్లలను పనుల్లో పెట్టుకుంటే చైల్డ్ లేబర్ యాక్టు ప్రకారం చర్యలు తప్పవన్నారు. అదే విధంగా బాల్యవివాహాలు చేయడం చట్టరీత్యా నేరమన్నారు. మైనర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలను నడపకూడదన్నారు. బాలికలను ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేస్తే పోక్సో చట్టం ప్రకారం కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఇంట్లోని వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులదేనని అన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ వెంకటేశ్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కృష్ణయ్య, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శ్రీదేవి, అహ్మద్, రాహుల్, రాంలాల్, సత్యన్న పాల్గొన్నారు.
వయోవృద్ధుల హక్కులపై అవగాహన ఉండాలి
వనపర్తి: వయోవృద్ధుల హక్కులపై అందరికీ అవగాహన ఉండాలని ఆర్డీఓ సుబ్రహ్మణ్యం అన్నారు. వయోవృద్ధుల వారోత్సవాల్లో భాగంగా సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో మహిళా, శిశు, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమశాఖ జిల్లా అధికారిణి సుధారాణి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ.. వయోవృద్ధులపై నిర్లక్ష్యం వహించే వారిపై ట్రిబ్యునల్‌లో ఫిర్యాదు చేయవచ్చని, 90 రోజుల వ్యవధిలో పూర్తిగా విచారించి న్యాయం చేకూర్చడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా వృద్ధ తల్లిదండ్రుల పోషణ బాధ్యత ఎవరిది.. వారి పోషణ నిమిత్తం దరఖాస్తులు ఎక్కడ ఎవరికీ సమర్పించాలి.. గిఫ్ట్ డీడీ అంటే ఏమిటనే అంశాలను వివరించారు. కార్యక్రమంలో జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ బాలయ్య, చీఫ్ ఎల్‌ఏడీసీ రఘు, వయోవృద్ధుల కమిటీ సభ్యులు నాగేంద్రం, చిన్నమ్మ తామస్, నర్సింహాగౌడ్, కమర్ రెహమాన్, అమీర్, వీరయ్య పాల్గొన్నారు.
ఎప్పటికప్పుడు వివరాలు నమోదు చేయాలి
వనపర్తి: జిల్లాలో నిర్ధారించిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలన్నింటిని వెంటనే ప్రారంభించాలని.. కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే డేటా ఎంట్రీ పూర్తిచేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవా రం కలెక్టర్ చాంబర్‌లో ధాన్యం కొనుగోళ్లపై జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో వరి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ధాన్యం విక్రయించిన రైతులకు సత్వరమే డబ్బులు అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యానికి, ఆన్‌లైన్‌లో చేసిన డేటా ఎంట్రీకి పొంతన లేదని.. డేటా ఎంట్రీ ఆలస్యం ఎందుకు అవుతుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 291 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి.. 13వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందన్నారు. అందులో 10,682 మెట్రిక్ టన్నులను మిల్లులకు తరలించినల్లు వివరించారు. 6వేల మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించి ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయాలన్నారు. 876 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించిన డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. మిల్లులకు ధాన్యం తరలించే అన్ని వాహనాలకు జియో ట్యాగింగ్ చేయాలన్నారు. బ్యాంకు గ్యారంటీ ఇవ్వని మిల్లర్లు ప్రైవేటు మిల్లింగ్ సైతం చేసుకోడానికి వీలు లేదన్నారు. బ్యాంకు గ్యారంటీ ఇవ్వని మిల్లులను వెంటనే సీజ్ చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యనాయక్, జిల్లా సివిల్ సప్‌లై అధికారి విశ్వనాథ్, డీఎం జగన్మోహన్, డీఏఓ ఆంజనేయులు, కోఆపరేటివ్ అధికారి ఇందిరా, రవాణాశాఖ అధికారి మాన స, మార్కెటింగ్‌శాఖ అధికారి స్వరణ్‌సింగ్ తదితరులు ఉన్నారు.
చట్టాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు


