చేనేత కార్మికులను విస్మరించడం తగదు
● చేనేత బాట కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వేస్లీ
అమరచింత: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కళను అందలమెక్కిస్తున్నామంటూనే కార్మికుల బతుకులను ఆగం చేస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వేస్లీ ధ్వజమెత్తారు. సోమవారం సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన చేనేత బాట కార్యక్రమంలో భాగంగా ఆయన అమరచింతలోని చేనేత కార్మికుల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ పరిస్థితులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జాన్‌వేస్లీ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు ప్రకటించిన రూ.లక్ష రుణమాఫీని అమలు చేయడంతో పాటు బ్యాంకు ద్వారా రుణాలు అందించాలని డిమాండ్ చేశారు. జియోట్యాగ్ ఉన్న నేత కార్మికులందరికీ ఎలాంటి షరతులు లేకుండా చేనేత భరోసా పథకం వర్తింపజేయాలన్నారు. మరుగున పడిన చేనేత పారిశ్రామిక సహకార సంఘాల ఎన్నికలను నిర్వహించి.. సహకార సంఘాల క్యాష్ క్రెడిట్ రుణాలను మాఫీ చేయాలన్నారు. మరణించిన కార్మికుల కుటుంబాలను త్రిఫ్ట్ ఫండ్‌తో ఆదుకోవాలన్నారు. కార్మికులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడంతో పాటు రూ. 5లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలన్నారు. సహకార సంఘాల వద్ద పేరుకుపోయిన వస్త్ర నిల్వలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని అన్నారు. రాష్ట్రస్థాయిలో చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేస్తున్నామని.. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నివేదిక ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు.
బీహార్ తరహాలో
ఓట్ల తొలగింపునకు కుట్రలు..
బీహార్‌లో ఓట్ల చోరీతో అధికారం చేజిక్కించుకున్న ఎన్‌డీఏ కూటమి.. ఇక మిగిలిన 12 రాష్ట్రాల్లో సైతం అదే తరహాలో ఓట్లను తొలగించి గద్దెనెక్కేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని జాన్‌వేస్లీ ఆరోపించారు. బీహార్‌లో 65 లక్షల ఓట్లను తొలగించి.. తమకు అనువుగా 25 లక్షల ఓట్లను చేర్పించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్‌డీఏ కూటమికి ఏజెంట్‌గా పనిచేసిందని విమర్శించారు. అక్కడ ప్రతిపక్షాలు, ఎన్‌డీఏ కూటమికి పోలైన ఓట్లే ఇందుకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి జుబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాల్లో మిత్రపక్షాల ఐక్యత గుర్తించాలన్నారు. ప్రతిపక్షాలతో కలిసి 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం కేంద్రంతో పోరాటానికి సిద్ధం కావాలన్నారు. సమావేశంలో సీపీఎం నాయకులు మహమూద్, జీఎస్ గోపి, వెంకటేశ్, రమేశ్, రాఘవేంద్ర, శ్యాంసుందర్, బుచ్చన్న, దామోదర్, శంకర్, జలగరి రాములు, బుచ్చన్న, రాఘవేంద్ర ఉన్నారు.


