చలి.. పులి
శరీర ఉష్ణోగ్రతలు తగ్గొద్దు..
జిల్లాలో పెరిగిన తీవ్రత
● వారం రోజులుగా మరింత తగ్గిన ఉష్ణోగ్రతలు
● జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు
మదనాపురం: జిల్లాలో చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. తెల్లవారుజామున పొగమంచు కమ్మేస్తోంది. మరో వారం రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోవచ్చని వాతావరణశాఖ అధికారులు సూచిస్తున్నారు. ఉదయం వేళ పొగమంచు కారణంగా వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడుతుండగా.. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, పనులకు వెళ్లే కార్మికులు చలికి వణికిపోతున్నారు. చలి తీవ్రతతో వరి, కంది, టమాట, పూల తదితర పంటల్లో ఎదుగుదల మందగిస్తోందని రైతులు చెబుతున్నారు. దిగుబడిపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఉష్ణోగ్రత మార్పులతో జలుబు, దగ్గు, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్లు, ఆస్తమా వంటి ఆరోగ్య సమస్యలు పెరుగుతాయని వైద్యులు సూచిస్తున్నారు. వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు, గుండె, మధుమేహ, రక్తపోటు వ్యాధిగ్రస్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.
జిల్లాలో గత వారం
నమోదైన ఉష్ణోగ్రతలు
తేది గరిష్టం కనిష్టం
10 32.3 15.3
11 32.3 15.3
12 33.0 16.2
13 33.1 17.2
14 32.7 15.1
15 33.2 13.2
16 33.0 13.7
తెల్లవారుజామున, రాత్రిళ్లు బయటకు వెళ్తే కోట్‌లు, మఫ్లర్, చేతి తొడుగులు తప్పనిసరిగా ధరించాలి. వేడి నీరు, సూప్‌లు, వేడి పాలు, కాఫీ, టీ వంటి పానీయాలు తీసుకోవడం మంచిది. చిన్నారులకు చన్నీటితో స్నానం చేయించకూడదు. పొగమంచు సమయంలో వాహనాలు నడిపేటప్పుడు ఫాగ్ లైట్లు ఉపయోగించాలి. పొగమంచు ప్రభావం తగ్గే వరకు పంటలకు నీరు అందించేందుకు ఉదయం ఆలస్యం చేయాలి. పూల, కూరగాయల తోటలపై ప్లాస్టిక్ సంచులు లేదా షేడ్ నెట్లు వేయడంతో చలి తీవ్రత నుంచి రక్షించవచ్చు. పశువులకు వేడి నీరు తాగించడంతోపాటు రాత్రివేళల్లో గదుల్లో ఉంచాలి.
చలికాలంలో రాత్రివేళల్లో శరీర ఉష్ణోగ్రత తగ్గిపోవడం చాలా ప్రమాదకరం. చలి నుంచి రక్షణ కోసం దుప్పట్లు, కోట్లు వినియోగించాలి. నీరు తాగడం తగ్గించకూడదు. శరీరం తేమ కోల్పోతే రోగనిరోధక శక్తి పడిపోతుంది. వృద్ధులు ఉదయం సూర్యకాంతి వచ్చిన తర్వాతే బయటకు వెళ్లాలి. పిల్లలకు తగిన వేడి దుస్తులు వేసి పాఠశాలలకు పంపించాలి. – డా. భవాని,
వైద్యురాలు, మదనాపురం పీహెచ్‌సీ
చలి.. పులి


