క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం
● రాష్ట్ర ప్రణాళికా సంఘం
ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి
వనపర్తి రూరల్: విద్యార్థులు క్రీడారంగంలో తమకంటూ ప్రత్యేకతను చాటుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. జిల్లెల చిన్నారెడ్డి కోరారు. ఆదివారం మండలంలోని చిట్యాల ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాల క్రీడా మైదానంలో ఉమ్మడి జిల్లా అండర్–17 క్రీడల ప్రారంభోత్సవానికి ఆయనతో పాటు ఆర్‌సీఓ శ్రీనివాస్‌గౌడ్, డీసీఓ శ్రీవేణి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ముందుగా చిన్నారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఒలింపిక్ జ్యోతిని వెలిగించి క్రీడాకారుల వందన సమర్పణను స్వీకరించారు. అనంతరం కబడ్డీ పోటీలను ప్రారంభించి మాట్లాడారు. దేశ నిర్మాణంలో క్రీడాకారులు తమవంతు పాత్ర పోషించాలన్నారు. ప్రతిభగల క్రీడాకారులను తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. క్రీడలు శారీరక దారుఢ్యం, మానసిక ప్రశాంతతను పెంపొందిస్తాయని తెలిపారు. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పిస్తామని చెప్పారు. ప్రిన్సిపాల్ ప్రశాంతి మాట్లాడుతూ.. క్రీడా పోటీల్లో ఉమ్మడి జిల్లాలోని 14 ఎంజేపీ బీసీ బాలుర గురుకులాల నుంచి 450 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని తెలిపారు. క్రీడాకారులకు పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పించామని, క్రీడల్లో చరుగ్గా పాల్గొని జయాపజయాలకు భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, పీఈటీలు, క్రీడాకారులు పాల్గొన్నారు.


