గుట్టకాయ స్వాహా..! | - | Sakshi
Sakshi News home page

గుట్టకాయ స్వాహా..!

Nov 15 2025 8:03 AM | Updated on Nov 15 2025 8:03 AM

గుట్ట

గుట్టకాయ స్వాహా..!

రాత్రిళ్లు దందా.. షరా‘మామూలు’

వివరాలు తెలవదు..

ఆనవాళ్లు కోల్పోతున్న పాలమూరు

నిబంధనల ప్రకారం ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే తవ్వకాలు చేపట్టాలి. అక్రమార్కులు పర్మిషన్లు తీసుకోకుండా.. అది కూడా చాలా చోట్ల రాత్రివేళ సైతం మట్టి దందా కొనసాగిస్తున్నారు. కొన్నిచోట్ల అర్ధరాత్రి దాటిన తర్వాతే తవ్వకాలు చేపట్టి భారీ వాహనాల్లో తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. రాజకీయ పార్టీలకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకుల ఆధ్వర్యంలో ఈ దందా కొనసాగుతోంది. ఇందులో ప్రధానంగా అధికార పార్టీకి చెందినవారే. వీరికి అధికార నేతలు అండగా నిలవడంతో ప్రభుత్వ యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. పోలీస్‌, రవాణా, మైనింగ్‌ శాఖకు వాహనాల సంఖ్యకు అనుగుణంగా రోజు, నెల వారీగా మామూళ్లు అందుతుండడంతోనే వారు పట్టించుకోవడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లావ్యాప్తంగా మట్టి మాఫియా రెచ్చిపోతుంది. అధికార నేతల అండదండలతో పగలు, రాత్రనక సహజ సంపదను కొల్లగొడుతోంది. ఎర్రమట్టి, మొరం కోసం గుట్టలను కేరాఫ్‌గా చేసుకుని అడ్డగోలుగా తవ్వకాలు చేస్తోంది. రాయల్టీ చెల్లించకుండా ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ.. భారీ వాహనాల్లో యథేచ్ఛగా తరలిస్తోంది. అవినీతికి అలవాటు పడిన పలు శాఖలు పట్టించుకోకపోవడంతో పాలమూరు క్రమక్రమంగా తన ఆనవాళ్లను కోల్పోయే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ ఫోకస్‌..

‘నారాయణపేట’లో ఇష్టారాజ్యం..

నారాయణపేట జిల్లా ఎక్లాస్‌పూర్‌, అప్పిరెడ్డిపల్లి గ్రామాల పరిధిలో గుట్టల్లో ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు తవ్వకాలు చేపడుతున్నారు. ఒక ట్రిప్పుపై వచ్చిన లాభంలో జేసీబీ యజమానులు, టిప్పర్‌ ఓనర్లు వాటాల లెక్కన పంచుకుంటున్నారు. మాగనూరు మండలం నుంచి నారాయణపేటకు ఇసుక రవాణా నిత్యం కొనసాగుతోంది. నారాయణపేటలో ఇసుకను అన్‌లోడ్‌ చేసిన తర్వాత తిరిగి మాగనూరుకు వెళ్తున్న క్రమంలో ఖాళీగా వెళ్లకుండా మొరం నింపుకుని వెళ్తూ అవసరమైన వాళ్లకు అమ్ముకుంటున్నారు. ఒక టిప్పర్‌ మొరం లోడ్‌కు మార్కెట్‌లో సుమారు రూ.4,500 నుంచి రూ.5 వేలు పలుకుతోంది. ఊట్కూరు మండలం ఎర్గట్‌పల్లి గుట్టను కూడా కొందరు తొలుస్తున్నారు. గ్రామంలోని చెరువు కట్ట మీద నుంచి టిప్పర్లు, జేసీబీలు తీసుకెళ్లి గుట్ట వద్ద తవ్వకాలు చేస్తున్నట్లు తెలిసింది. ధన్వాడ మండలం మణిపూర్‌ తండా గుట్ట, గున్ముక్ల, ఎమ్మినోనిపల్లి మాలేగుట్ట, దేవుని గుట్టపై అక్రమంగా తవ్వకాలు చేపట్టి.. మట్టిని ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. మద్దూరు మండలం ఎరగ్రోల్‌ తండా సమీపంలో, కోస్గి మండలం కడెంపల్లి పెద్ద గుట్టను కూడా కొల్లగొడుతున్నారు.

● మహబూబ్‌నగర్‌ జిల్లాకు సంబంధించి నగర పరిధిలో ఎదిర, మౌలాలి గుట్ట, వీరన్నపేట, కొర్షగుట్ట ప్రాంతాల్లో అక్రమార్కులు గుట్టలను పిండి చేస్తున్నారు. మొరం, ఎరమ్రట్టిని యథేచ్ఛగా తరలిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. అడ్డాకుల మండలం కేంద్రంలోని పలుగు గుట్టపై కూడా అక్రమంగా మట్టి తవ్వకాలు కొనసాగుతున్నాయి.

● వనపర్తి జిల్లాలో వీపనగండ్ల మండలం గోపాల్‌దిన్నె రిజర్వాయర్‌ రక్షణ కట్ట, ఖిల్లాఘనపురం మండలం సోళిపూర్‌, కర్నెతండా, జిల్లాకేంద్రంలోని శ్రీనివాసాపురం శివారులోని మబ్బు గుట్టపై అక్రమార్కులు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా యథేచ్ఛగా తవ్వతున్నారు.

● జోగుళాంబ గద్వాల జిల్లాలో పూడూరు, వజ్రాలగుట్ట, నది అగ్రహారం సమీపంలో, పిల్లిగుండ్ల కాలనీ, ముల్కల్‌ పల్లి, జమ్మిచేడు తదితర ప్రాంతాల్లోని గుట్టలను అక్రమార్కులు కేరాఫ్‌గా చేసుకుని మట్టి దందా చేస్తున్నారు. అదేవిధంగా ధరూరు, గట్టు, కేటీ దొడ్డి, మల్దకల్‌ మండలాల్లోని ప్రభుత్వ భూముల్లో తవ్వకాలు చేపట్టి అనధికారకంగా మట్టి తరలిస్తున్నారు.

● నాగర్‌కర్నూల్‌ జిల్లా కోడేరు మండలంలోని ఊర గుట్టను కొల్లగొడుతున్నారు. రాత్రివేళల్లో టిప్పర్లతో నిత్యం మట్టి తరలింపు కొనసాగుతోంది. అదేవిధంగా తాడూరు మండలంలోని కొమ్ముగుట్టపై తరచుగా తవ్వకాలు జరుగుతున్నాయి.

రాయల్టీ చెల్లించకుండా దందా..

ప్రభుత్వ పనులకై నా, ప్రైవేట్‌కై నా మట్టి కావాల్సి వస్తే.. నిబంధనల ప్రకారం టన్నుకు రూ.56 చొప్పున మైనింగ్‌ శాఖకు రాయల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఎంత మేర కావాలో పేర్కొంటూ ఆ శాఖకు అర్జీ పెట్టుకోవాలి. ఆ తర్వాత మైనింగ్‌ శాఖ డీడీఓ కోడ్‌ పేరిట చలానా తీయాలి. ఈ మేరకు నిర్దేశిత సర్వే నంబర్‌లో చలానా చెల్లించిన మేరకు అధికారులు కొలతలు (పొడవు, వెడల్పు, లోతు) వేసి అనుమతి పత్రాలు ఇస్తారు. ఆ తర్వాతే తవ్వకాలు చేపట్టి మట్టి తరలించాల్సి ఉంటుంది. కానీ ఉమ్మడి పాలమూరులోని అన్ని జిల్లాల్లో ఒకరిద్దరు మినహా అక్రమార్కులు నిబంధనలను తుంగలో తొక్కి దందా సాగిస్తున్నారు. రాయల్టీ ఎగవేస్తూ యథేచ్ఛగా గుట్టలు తొలుస్తుండడంతో పర్యావరణంపై ప్రభావం పడుతుండడంతోపాటు ప్రభు త్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది.

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రెచ్చిపోతున్న మాఫియా

ఎరమ్రట్టి, మొరం కోసం అడ్డగోలు తవ్వకాలు

రాజకీయ నేతల అండతో

యథేచ్ఛగా దందా

రాయల్టీ ఎగవేతతో సర్కారు

ఆదాయానికి గండి

మైనింగ్‌, రెవెన్యూ, పోలీస్‌ శాఖపై విమర్శలు

నేను కొత్తగా వచ్చా. రెండు రోజులు మాత్రమే అటెండ్‌ అయ్యా. ఎక్కడ గుట్ట తవ్వి మొరం, మట్టి కొడుతున్నారో వివరాలు నాకు తెలవదు. రాయల్టీ కూడా చెల్లిస్తున్నారో లేదో తెలవదు. మొరం, మట్టి తరలింపునకు ఇసుక లెక్క నిబంధనలు ఉండవు. 24 గంటలూ కొట్టుకోవచ్చు.

– సత్యనారాయణ,

మహబూబ్‌నగర్‌ ఏడీ, మైనింగ్‌ శాఖ

గుట్టకాయ స్వాహా..! 1
1/3

గుట్టకాయ స్వాహా..!

గుట్టకాయ స్వాహా..! 2
2/3

గుట్టకాయ స్వాహా..!

గుట్టకాయ స్వాహా..! 3
3/3

గుట్టకాయ స్వాహా..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement