నెహ్రూ సేవలు చిరస్మరణీయం
వనపర్తి: భారత స్వాతంత్య్ర సమరయోధుడు, మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ దేశానికి చేసిన సేవలు ఎనలేనివని కలెక్టర్ ఆదర్శ్ సురభి కొనియాడారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని వైద్య కళాశాల సమీపంలో ఉన్న బాలసదనంలో జిల్లా మహిళ, సీ్త్ర, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలల దినోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి అక్కడే ఉన్న చిన్నారులతో కేక్ కట్ చేయించి బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెహ్రూకు చిన్నారులంటే అమితమైన ప్రేమని గుర్తు చేశారు. బాలసదనం విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకొని బాగా చదివి జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. చిన్నారులు కోరినట్లుగా హైదరాబాద్ పర్యటనకు తీసుకెళ్లాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం విద్యార్థులకు స్వెటర్లు పంపిణీ చేశారు. అదేవిధంగా వివిధ పోటీల్లో ప్రతిభ కనబర్చిన చిన్నారులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. క్విజ్ పోటీలో రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థినికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. బాలసదనం ప్రహరీ నిర్మాణానికి సహకరించిన కలెక్టర్‌కు సంక్షేమశాఖ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమశాఖ అధికారి సుధారాణి, తహసీల్దార్ రమేష్‌రెడ్డి, బాలల సంరక్షణ కమిటీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
ప్రణాళికతో చదివితే ఉన్నత శిఖరాలకు..
కొత్తకోట రూరల్: విద్యార్థులు ప్రణాళికతో చదివితే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. శుక్రవారం కొత్తకోట ప్యూపిల్స్ పాఠశాలలో నిర్వహించిన కిడ్స్ ఉత్సవ్‌కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాలలో చదివి వైద్య సీట్లు సాధించిన పలువురు విద్యార్థులను కలెక్టర్ అభినందించారు. అనంతరం కలెక్టర్‌కు పాఠశాల యాజమాన్యం జ్ఞాపిక అందజేశారు. పాఠశాల చైర్మన్ రాజవర్ధన్‌రెడ్డి, జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ, ఎంపీడీఓ వినీత్, తహసీల్దార్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


