సీఎంఆర్ అప్పగింతలో నిర్లక్ష్యం వద్దు
కొత్తకోట రూరల్: రైస్‌మిల్లర్లు సీఎంఆర్ అప్పగింతలో జాప్యం జరగకుండా చూడాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ కోరారు. శుక్రవారం పెద్దమందడి మండలం జగత్‌పల్లి, మణిగిళ్లలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్వరితగతిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిర్వాహకులకు సూచించారు. ధాన్యం తూకం సరిగా చేయాలని, తేడాలొస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కేంద్రానికి వచ్చిన ప్రతి రైతు వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని, పారదర్శకత పాటించాలని సూచించారు. తేమ శాతాన్ని కచ్చితంగా పరిశీలించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొనుగోళ్లు చేయాలన్నారు. సేకరించిన ధాన్యాన్ని వెనువెంటనే కేటాయించిన రైస్‌మిల్లులకు తరలించాలని కోరారు. అనంతరం జిల్లాకేంద్రంలోని రాఘవేంద్ర రైస్‌మిల్లును సందర్శించి పంట నూర్పిళ్ల పురోగతిని సమీక్షించారు. రైతులకు నష్టం వాటిల్లకుండా ధాన్యాన్ని జాగ్రత్తగా తరలించాలని.. మిల్లింగ్ ప్రక్రియ వేగవంతం చేయడానికి అవసరమైన మేరకు హమాలీలను సమకూర్చుకోవాలని సూచించారు.
చదువుతోనే
సమాజంలో గుర్తింపు
పాన్‌గల్: చదువుతోనే సమాజంలో గుర్తింపు, గౌరవం లభిస్తాయని.. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని బాగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించి గురువులు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకరావాలని ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం మండలంలోని తెల్లరాళ్లపల్లిలో ఉన్న లిటిల్‌స్టార్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కల పెంపకం, మూఢ నమ్మకాలను పారద్రోలి ప్రజలను చైతన్యం చేసేలా విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. మహనీయులను స్పూర్తిగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ విద్యపైనే దృష్టి సారించి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని కోరారు. తల్లిదండ్రులు తమ పిల్లల చదువు, సరైన మార్గంలో నడిచేందుకు కొంత సమయాన్ని కేటాయించాలని సూచించారు. చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో రాణించేలా ప్రోత్సహించాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు పలువురిని అకట్టుకున్నాయి. అంతకుముందు ఎస్పీ జ్యోతి వెలిగించి నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎంఈఓ ఆనంద్, ఎస్‌ఐ శ్రీనివాసులు, ప్రిన్సిపాల్ శేఖర్‌యాదవ్, కరస్పాండెంట్ ఆంజనేయులు, గిరిజన సంఘం జిల్లా నాయకులు బాల్యానాయక్, జానపద కళాకారులు డప్పు స్వామి పాల్గొన్నారు.
సీఎంఆర్ అప్పగింతలో నిర్లక్ష్యం వద్దు


